Rahul US Visit: 


అమెరికా పర్యటనలో రాహుల్ 


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ యూనివర్సిటీలో NRI సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీ సర్కార్‌పైనా విమర్శలు చేశారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడాన్నీ ప్రస్తావించారు. ఇందుకు పార్టీ అనుసరించిన వ్యూహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. 2024 ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటెజీతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ భేటీలో పలు ప్రశ్నలు ఎదుర్కొన్న రాహుల్...విపక్షాల ఐక్యతపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 


"ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే...ప్రతిపక్షాలన్నీ ఓ పద్ధతి ప్రకారం ఒక్కటవ్వాలి. బీజేపీలోనూ కొన్ని లొసుగులున్నాయి. వాటిని పట్టుకోగలిగి, ప్రతిపక్షాలు సరైన విధంగా ఒక్కటి కాగలిగితే సులువుగానే ఆ పార్టీని ఓడించొచ్చు. కర్ణాటక ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారుగా. బీజేపీతో నేరుగా పోరాడాం. గెలిచాం. కానీ...అందుకు మేం ఫాలో అయిన మెకానిజం ఏంటో అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. భారత్ జోడో యాత్ర ప్రభావం ఆ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ 10 రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టింది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 






బీజేపీని ఓడించాలంటే అందుకు ప్రత్యామ్నాయ శక్తి ఒకటి కావాలని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఒక్కటైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు. ఇందుకోసం తాము ఎంతో ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. 


"ప్రతిపక్షాల ఐక్యత కోసం మేమెంతో ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నాలన్నీ దాదాపు ఫలిస్తున్నాయి. కానీ...బీజేపీని ఓడించాలంటే ఇంతకు మించి వ్యూహాలు అవసరం. ప్రతిపక్షాలు ఒక్కటైతే చాలదు. ప్రజలకు ప్రత్యామ్నాయం ఏంటో చూపించగలగాలి. ఇలా చేసిన ప్రయత్నాల్లో భారత్ జోడో యాత్ర ఒకటి. ఈ ఐడియాని ప్రతిపక్షాల్లో ఏ పార్టీ కూడా కాదనలేదు. ఒక్కటైతే సరిపోదు. అన్ని పార్టీల ఆలోచనా విధానం ఒక్కటవ్వాలి. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలమో వివరించాలి. అందుకే...మా పార్టీ ఈ అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. "


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


ప్రధాని మోదీ ప్రతిష్ఠ తగ్గిపోతోందని వెల్లడించారు రాహుల్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్యారంగంలోని సమస్యలు తీర్చలేకపోతున్నారని మండి పడ్డారు. వాటన్నింటినీ పక్కదోవ పట్టించి పార్లమెంట్‌లో సెంగోల్‌పై అందరూ మాట్లాడుకునేలా చేశారని విమర్శించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భారతీయులతో మాట్లాడారు. రాజ్యసభ, లోక్‌సభలో సీట్లు పెరిగే అంశంపైనా తన అభిప్రాయాలు వెల్లడించారు. "మీ మనసుల్లో విద్వేషం, కోపం, గర్వం ఉండి ఉంటే బహుశా మీరంతా బీజేపీ మీటింగ్‌లో కూర్చుని ఉండేవారేమో" అని పరోక్షంగా బీజేపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో భారత్ జోడో యాత్ర గురించి కూడా ప్రస్తావించారు. 


Also Read: BJP on Rahul Gandhi: రాహుల్ ఇంకా మారలేదు, మోదీ పాపులారిటీ చూసి తట్టుకోలేకపోతున్నారు - బీజేపీ కౌంటర్‌