Bengaluru Blast News: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు హోంమంత్రి జి పరమేశ్వర ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 2022లో మంగళూరులోనూ ఓ పేలుడు సంభవించిందని, అప్పుడు కూడా ఇవే పేలుడు పదార్థాలు వాడారని మంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఆ పేలుడికి, ఇప్పుడు ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. అయితే...బీజేపీ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేశారన్న విషయంలో ఇప్పటికే మండి పడుతోంది. ఇప్పుడీ పేలుడు ఘటనకీ దాన్ని లింక్ చేస్తోంది. పాకిస్థాన్ జిందాబాద్‌ నినాదాలు చేసిన వారికి, ఈ పేలుడుకి కచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందని ఆరోపిస్తోంది. అటు పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


"8 టీమ్స్‌తో విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. CC కెమెరాల ఫుటేజ్‌ని సేకరిస్తున్నాం. ప్రతిపక్షాలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు. మంగళూరు పేలుడు కేసుకి, దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. NSG వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సమావేశమయ్యాను. బీజేపీ అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలి"


- జి పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి






ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురు అనుమానితులకు పేలుడు ఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితుడికి సహకరించినట్టు తెలుస్తోంది. ఈ పేలుడుకి గంట ముందు నిందితుడు రామేశ్వరం కేఫ్‌లోకి వచ్చాడు. ఇడ్లీ ఆర్డర్ చేసి అక్కడే తిని బ్యాగ్‌ని పక్కనే ఉన్న చెట్టు పక్కన పెట్టి వెళ్లాడు. ఆ తరవాత కాసేపటికి పేలుడు సంభవించింది. ఇడ్లీ తినే సమయంలో ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 






ఇప్పుడీ కేసులో కీలక సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయి. CC కెమెరా ఫుటేజ్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌తో కేఫ్‌లోకి వచ్చినట్టు రికార్డ్ అయింది. అతనిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...ఈ వ్యక్తే కేఫ్‌లోకి వెళ్లి అక్కడ బ్యాగ్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరవాత కాసేపటికే పేలుడు సంభవించింది. సీసీ ఫుటేజ్‌లో అనుమానితుడు మాస్క్, కళ్లజోడు పెట్టుకుని ఉన్నాడు. ఈ అనుమానితుడితో పాటు ఉన్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 1వ తేదీన మధ్యాహ్నం 12.50, ఒంటిగంట మధ్య కాలంలో ఈ పేలుడు సంభవించింది.