Calcutta High Court News: కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. IPC ప్రకారం ఇది నేరమే అని స్పష్టం చేసింది. జస్టిస్ జై సేన్‌గుప్త ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌ని డార్లింగ్ అని పిలిచాడు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలియని మహిళలను అలా సంబోధిస్తే లైంగికంగా వేధించినట్టే అవుతుందని అని చెప్పింది. 


"కానిస్టేబుల్ అనే కాదు. తెలియని మహిళను ఎవరు డార్లింగ్ అని పిలిచినా అది కచ్చితంగా నేరమే. అలా పిలిచిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నా లేకపోయినా అది నేరమే అవుతుంది. ఇలాంటి వాళ్లకి శిక్ష పడాల్సిందే. ఇలాంటి పదాలతో సంబోధించడం అంటే లైంగికంగా వేధించడమే"


- కోల్‌కత్తా హైకోర్టు 


ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో జస్టిస్ సేన్‌గుప్తా తీవ్ర అసహనానికి లోనయ్యారు. రోడ్డుపైన వెళ్తూ ఓ యువతినో, మహిళనో చొరవ తీసుకుని మరీ డార్లింగ్ అనే స్థాయికి భారత సంస్కృతి ఇంకా దిగజారిపోలేదని స్పష్టం చేశారు. ఇది ఇండియన్ కల్చర్ కాదని వెల్లడించారు. పైగా...మద్యం మత్తులో ఇలాంటివి చేస్తే అది ఇంకా పెద్ద నేరం అవుతుందని తేల్చి చెప్పారు. ప్రాథమిక వివరాల ప్రకారం...ఓ మహిళా కానిస్టేబుల్ కోల్‌కత్తాలో దుర్గా పూజ జరుగుతుండగా అక్కడ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి గలాటా చేస్తున్నాడని తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్లారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ సమయంలోనే నిందితుడు మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. "డార్లింగ్ నాకు ఫైన్ వేస్తావా" అంటూ పిచ్చిగా మాట్లాడాడు. దీనిపై కోర్టు వరకూ వెళ్లారు మహిళా కానిస్టేబుల్. డార్లింగ్ అని పిలిచినట్టు తన వద్ద అన్ని ఆధారాలున్నాయని వాదించారు. అప్పటికే కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడు తన తప్పుని ఒప్పుకోవడం వల్ల శిక్షను నెల రోజులకు తగ్గించినట్టు వివరించింది.