Billboard Collapses: మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ముంబయి సహా ప్రధాన నగరాలన్నింటిపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చి చేరుకున్నాయి. మరి కొన్ని చోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఈ క్రమంలోనే థానేలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఈదురు గాలుల కారణంగా ఓ భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే..ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. మూడు వాహనాలు మాత్రం ధ్వంసమయ్యాయి. ఓ షాప్ ముందు పార్క్ చేసి ఉన్న వాహనాలపై ఉన్నట్టుండి ఈ హోర్డింగ్ పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కింద ఎవరూ లేరని, హోర్డింగ్ కింద ఎవరూ చిక్కుకోలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ కారుతో పాటు రెండు ఆటోలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం జరిగే ముందు ఉరుములు మెరుపులు వచ్చాయి. 




ఈ ప్రమాదం జరిగే సమయానికి ఓ మహిళ అక్కడే ఉంది. తృటిలో అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ హోర్డింగ్‌ని తొలగించనున్నారు. అంతకు ముందు ముంబయిలోని ఘట్కోపర్‌ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. మే 13వ తేదీన ముంబయిలో భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలోనే ఘట్కోపర్‌లోని ఓ భారీ బిల్‌బోర్డ్ కుప్పకూలింది. ఈ హోర్డింగ్ కింద చాలా మంది నలిగిపోయారు. 17 మంది ప్రాణాలు కోల్పోగా 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హోర్డింగ్ పెట్టిన మీడియా కంపెనీపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. ఇప్పటికీ ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇప్పుడు థానేలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.