Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల డౌన్‌టౌన్ లండన్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా తాను అది కలా, నిజమా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నానని ఆ అనుభవాన్ని వివరించారు. భవిష్యత్ అటానమస్ వెహికల్స్ (AV)దే అని పేర్కొన్నారు. గత వారం ‘Hands Off The Wheel: The Rules Of The Road Are About To Change’ అనే బ్లాగ్ పోస్ట్‌లో, గేట్స్.. బ్రిటిష్ స్టార్టప్ వేవ్ అటానమస్ వాహనంతో తన అనుభవాన్ని పంచుకున్నారు. వేవ్ వ్యవస్థాపకుడు-CEO అలెక్స్ కెండాల్, సేఫ్టీ ఆపరేటర్‌తో కలిసి ప్రయాణించిన గేట్స్.. వాహనం ఇంకా అభివృద్ధి దశలో ఉందని, చాలా తొందరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
లండన్‌లో ‘సెల్ఫ్ డ్రైవ్ జాగ్వార్’ కారులో ప్రయాణించిన బిల్ గేట్స్.. ‘వాస్తవం, ఊహాజనిత’ అనుభవాల మిశ్రమంగా తన ప్రయాణం సాగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో వచ్చే అతిపెద్ద మార్పు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలేనని తెలిపారు. అయితే ప్రపంచం పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవ్ వాహనాలకు మారడానికి ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టొచ్చని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఆఫీసు పనిని వ్యక్తిగత కంప్యూటర్ ఏ విధంగా మార్చి వేసిందో మనం చూశామని, వాహన రంగంలో సెల్ఫ్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఇటువంటిదేనని తన బ్లాగ్‌లో ‘Hands Off The Wheel: The Rules Of The Road Are About To Change’ రాసుకున్న కథనంలో బిల్‌గేట్స్ పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో సెల్ఫ్ డ్రైవ్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో మరింత పురోగతి సాధిస్తామని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటువంటి వాహనాల కోసం భవిష్యత్‌లో ప్రత్యేక రహదారులను రూపొందించే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేశారు.
భవిష్యత్తులో 'డ్రైవింగ్‌కు సహకరించే వ్యవస్థలు' ఎలా మార్పుచెందుతాయో గేట్స్ అంచనా వేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వాహనం ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారో తెలియాలని.. ఇలాంటి వాహనాలకు సంబంధించి ప్రభుత్వం కొత్త చట్టాలు, నిబంధనలను రూపొందించాల్సి వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. స్వయంప్రతిపత్త వాహనాల రాకతో రోడ్ల నిర్మాణంలోనూ గణనీయమైన మార్పులు రావచ్చని బిల్ గేట్స్ భావిస్తున్నారు, భవిష్యత్తులో "అటానమస్ వెహికల్-ఓన్లీ" లేన్‌లు ఉంటాయా అని ప్రశ్నించారు.
అటానమస్ వెహికల్స్ (AV)కు అవసరమైన అన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొనే స్థాయికి వేగంగా చేరుకుంటున్నాయని... ఇప్పుడు వాటిలో అల్గారిథమ్‌లను మెరుగుపరచడం, ఇంజనీరింగ్‌ను పరిపూర్ణం చేయడంపై దృష్టి కేంద్రీకరించారని వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో సెల్ఫ్ డ్రైవ్ వాహనాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు బిల్ గేట్స్ తెలిపారు. అయితే స్టీరింగ్ లేని ఈ వాహనాలను నడిపేందుకు ప్రజలు మొదట సుముఖంగా ఉంటారని తాను అనుకోవడం లేదని స్పష్టంచేశారు.
బిల్‌గేట్స్ ప్రయాణించిన వాహనాన్ని వేవ్ అనే స్టార్టప్ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆ సంస్థ డీప్‌లెర్నింగ్ సాంకేతికతను వినియోగించిందని బిల్‌గేట్స్ వివరించారు. మానవులు డ్రైవింగ్‌ను ఎలా నేర్చుకుంటారో అనుకరించడానికి వేవ్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించిందని.. ఇది “అల్గారిథం ఆధారంగా నేర్చుకుంటుంది. ఈ విధనంలో డ్రైవింగ్.. వాస్తవ ప్రపంచం, దాని పరిసరాలను అర్థం చేసుకోవడానికి, అవసరమైన సమయంలో ప్రతిస్పందించడానికి కావలసిన చర్యలు చేపడుతుంది." అని బిల్ గేట్స్ వెల్లడించారు.