Bilkis Bano Case: 


నిర్ణయం వెనక్కి తీసుకోండి..


బిల్కిస్ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవిత ఖైదు విధించిన నేరస్థులను ఉన్నట్టుండి ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. దీనిపై బిల్కిస్ బానో స్పందించారు. "న్యాయ వ్యవస్థపై ఉన్న నా నమ్మకం చెదిరింది. ఉన్నట్టుండి శరీరం మొద్దుబారిపోయినట్టు అయిపోయింది" అంటూ కామెంట్ చేశారు. ఆ నిందితులను విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె...ఈ నిర్ణయం తీసుకునే ముందు తన భద్రత గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించిన బిల్కిస్ బానో...భయం లేకుండా జీవించే హక్కుకల్పించాలని కోరారు. 


మహిళకు న్యాయం జరగాల్సిన తీరు ఇది కాదు..


బిల్కిస్ బానో తరపున ఆమె న్యాయవాది కూడా స్పందించారు. "ఆగస్టు 15న ఆ 11 మంది నిందితుల్ని విడుదల చేశారన్న వార్త ఆందోళన కలిగించింది. 20 ఏళ్ల క్రితం ఎలాంటి మానసిక వేదన అనుభవించానో ఇప్పుడూ అదే అనుభవిస్తున్నాను. నా జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లు ఎంతో సులువుగా బయటకు వచ్చేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "నాకే మాట్లాడాలో అర్థం కావట్లేదు" అని అన్నారు. "ఓ మహిళకు న్యాయం జరగాల్సిన తీరు ఇదేనా..? సర్వోన్నత న్యాయస్థానాలను ఎంతో గౌరవించాను. నమ్మాను. న్యాయవ్యవస్థనూ విశ్వసించాను. 
మానసిక వేదనతోనే ఏదోలా జీవించటం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ 11 మంది దోషులను విడుదల చేసి నా మనశ్శాంతిని దూరం చేశారు. న్యాయవ్యవస్థపై నాకున్న నమ్మకాన్ని పోగొట్టారు. నా బాధ నా గురించి మాత్రమే కాదు. కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరిగే ప్రతి మహిళ గురించి" అని బిల్కిస్ బానో ఆవేదన చెందారు. 


సామూహిక అత్యాచారం..


గుజరాత్ అల్లర్లు-2002 సమయంలో బిల్కిస్ బానోపై  సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యుల ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్‭లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతురితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించుకున్నారు. ఈ ఘటనపై అప్పట్లో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను 2004లో అరెస్ట్ చేశారు. 2008 జనవరి 1న వీరికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్ష పడిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన ఖైదీల కింద విడుదల చేశారు. వీరిని విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం వంటి కేసులున్న వారిని విడుదల చేయకూడదన్న నిబంధనలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Also Read: The Ghost Promo: ‘ది ఘోస్ట్’ టీజర్: ఒక రాయి, నిప్పు, ఒక ఆయుధం - అంచనాలు పెంచేస్తున్న నాగ్ మూవీ!


Also Read: Vijaya Shanthi: కేసీఆర్ చెప్పేవన్నీ తుపాకి రాముడి కథలే, సీఎం వ్యాఖ్యలపై విజయ శాంతి కౌంటర్