Vijaya Shanthi: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేశానని గొప్పలు చెప్పుకోవడం కంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదని బీజేపీ నాయకురాలు విజయ శాంతి అన్నారు. ఆయన ఏరోజూ దీక్ష చేయలేదనే విషయం యావత్ ప్రజానీకానికి తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఖమ్మంలో కేసీఆర్ జ్యూసులు తాగితే... విద్యార్థులు, ఉద్యమ కారులు, ప్రజలు తిరగబడి తన్నే పరిస్థితి అయనకి వచ్చిందన్నది ఎవరూ మర్చిపోలేదంటూ కామెంట్లు చేశారు. ఆయన నిమ్స్ లో చేసిన దొంగదీక్ష ముచ్చట గురించి అందరికీ తెలిసిందేనని, ప్రత్యేకంగా తాను వివరించాల్సి అవసరం లేదని ఆమె అన్నారు. దిల్లీలో దీక్ష పేరుతో చేసిన గోల్ మాల్ కథక గురించి టీఆర్ఎస్ నాయకుల అందరికీ బాగా తెలుసుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఘనంగా చేశారని, అందుకే తెలంగాణ సాధ్యమైందని స్వయంగా గొప్పలు చెప్పుకోవడం కన్నా హస్యాస్పదం మరొకటి లేదు. ఆయన ఏ దీక్షా చెయ్యలేదన్నది యావత్ ప్రజలకు తెలుసు. ఖమ్మంలో కేసీఆర్ జ్యూసులు తాగితే... విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజలు తిరగబడి తన్నే పరిస్థితి అయనకి వచ్చిందన్నది ఎవలు యాద్ మర్వలే. ఇక నిమ్స్‌లో దొంగ దీక్ష ముచ్చట అందరికీ తెలిసిందే. ఢిల్లీలో దీక్ష పేరుతో గోల్‌మాల్ కతలు టీఆరెస్‌లో ముఖ్యులందరికీ తెలుసు. ఇక ఈ కేసీఆర్ గారు. చావు నోట్లో తలపెట్టిన, కోమా దాంక ఎల్లిన అని చెప్పేవి మొత్తం అవాస్తవ తుపాకి రాముడి కతలు. ఇవన్నీ విని మంది నవ్వుకుంటున్రు. ఇక ఈ కేసీఆర్ చెబుతున్న ఆ దొంగ దీక్ష కూడా చేసింది 2009ల... తెలంగాణ వచ్చింది 2014ల... ఆ ఝూటా దీక్షకి, ఈ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం ఏంటో ఎవలికీ సమజ్ కాదు. గీయనేమన్న 2009 నుండి 2014 దాకా దీక్షలోనే కూసున్నడా? ఏమో... మనం అమాయకులగుంటే అట్ల కూడా చెప్పి పబ్లిక్ నేత్తికి టోపీ పెట్టే సమర్థత సంపూర్ణంగా సీఎం గారికి స్వంతం." - విజయ శాంతి, బీజేపీ నాయకురాలు
చావు నోట్లో తల పెట్టి వచ్చాను, కోమా దాకా వెళ్లానంటూ సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రసంగాల్లో ఈ మాటల విన్న ప్రజలంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారని విజయ శాంతి తెలిపారు. అలాగే ఆయన చేశానని చెబుతున్న దొంగ దీక్ష జరిగింది 2009లో అయితే.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయింది 2014లో అని ఆమె చెప్పారు. కనీసం ఐదేళ్ల తేడాతో జరిగిన ఈ దీక్షకి, రాష్ట్రం ఏర్పాటుకి సంబంధం ఏంటో ఇప్పడికీ ఎవరికీ తెలిదయని విమర్శించారు. ఆయన చెప్పేవి నమ్ముదాం అనుకున్నా.. సీఎం కేసీఆర్ ఐదేళ్ల పాటు ఏం దీక్ష చేయలేరని తెలిపారు. వినే వాళ్లు వెర్రోళ్లయితే సీఎం కేసీఆర్ అలా కూడా చెప్పి ప్రజల నెత్తిన టోపీ పెడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.