ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. రెండు నెలల వ్యవధిలోనే మూడో సారి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ఇక్కడ వరద నీరు ప్రవహిస్తోంది. వరుసగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో భద్రాచలం ప్రాంతం ఇప్పుడు బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


జూలై నెలలోనే రెండు సార్లు మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి ప్రస్తుతం మళ్లీ అదే స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గత నాలుగు రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరిగింది. జూలైలో వచ్చిన వరదలను మరిచిపోకముందే, నెలరోజుల వ్యవదిలోనే మూడో సారి భద్రాచలం వద్ద గోదావరి నది మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండటంతో భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం భద్రాచలం వద్ద 53 అడుగులకు వరద నీరు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.


బుధవారం ఉదయం 6 గంటలకు 54.40 అడుగులు, రాత్రి తొమ్మిదిగంటలకు 54.60 అడుగులకు చేరుకుంది. అయితే ఆ తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రస్తుతం 54 అడుగులకు పైబడి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళుతుంది. మరోవైపు బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మరోమారు భద్రాచలం వద్ద వరద నీరు పెరిగే అవకాశాలున్నాయి. వరుసగా వస్తున్న వరదలతో భద్రాచలం పట్టణంతోపాటు పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే జూలై నెలలో వచ్చిన వరదలకు తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు మరోమారు అదే స్థాయిలో వరదలు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. 


రాకపోకలకు ఇబ్బందులు..
వరద నీరు ఉదృత్తంగా ప్రవహిస్తుండంతో భద్రాచలం నుంచి కొన్ని ప్రాంతాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరుకుంది. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో ప్రస్తుతం రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు కూనవరం వైపు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. బూర్గంపాడు నుంచి కుక్కునూరుకు వెళ్లే మార్గం కూడా నిలిచిపోయింది. వరద నీరు రోడ్లపైకి చేరుతుండటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం వద్ద స్నానాలఘాట్‌లు పూర్తిగా మునిగిపోయాయి. స్నానాల ఘాట్‌ వద్ద ఉన్న గోదావరి మాతా విగ్రహం వద్ద ఉన్న ఆలయాల్లోకి వరద నీరు చేరుకుంటుంది.


మరోవైపు కరకట్ట స్లూయిజ్‌ల వద్ద నుంచి నీరు వస్తుండటంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి వరద నీరును తిరిగి గోదావరిలోకి ఎత్తిపోస్తున్నారు. ఇదిలా ఉండగా ఎపీలోని ముంపు ప్రాంత ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. గత నెలలో వచ్చిన వరదలతో సుమారు 20 రోజుల పాటు పునరావాస శిబిరాల్లోనే ఉన్న వీళ్లు మళ్లీ వరద వస్తే తాము పునరావాస శిబిరాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు సైతం పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు. గోదావరికి వరుసగా వస్తున్న వరదల కారణంగా భద్రాచలం పరిసర ప్రాంతాలతోపాటు పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలు వణికిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.