Bihar Political Crisis: బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ ఉన్న సస్పెన్స్‌కి తెర దించుతూ అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కి తన రాజీనామా లేఖని సమర్పించారు. మహాఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు నితీశ్. "మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతునిస్తాం" అని ఎమ్మెల్యేలు భరోసా ఇవ్వడం వల్ల వెంటనే ఆయన రాజీనామా చేశారు. అటు బీజేపీతో మంతనాలు పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే బీజేపీతో చేతులు కలిపి NDAలో చేరనున్నారు. ఆ తరవాత 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నితీశ్. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన సీఎం పదవిని చేపట్టనున్నట్టు సమాచారం. 






బిహార్‌లో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. అందులో RJDకి అత్యధికంగా 79 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే..ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 మ్యాజిక్ ఫిగర్‌ని అందుకోవాలి. ఇక బీజేపీకి బిహార్‌లో 78 మంది ఎమ్మెల్యేలున్నారు. లెక్కల వారీగా చూస్తే.. RJD- 79 BJP- 78 JD(U) - 45 కాంగ్రెస్ - 19 సీపీఐ (M-L) - 12. ఇప్పుడు నితీశ్ మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వస్తే తమకున్న 45 మంది ఎమ్మెల్యేలకు బీజేపీలోని 78 మంది ఎమ్మెల్యేలు తోడవుతారు. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా ఓ సీటు ఎక్కువే..అంటే 123 మంది ఎమ్మెల్యేలుంటారు.


తన రాజీనామాపై నితీశ్ కుమార్ స్పందించారు. రిజైన్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.


"ఇవాళ నేను బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ని కోరాను. నా రాజీనామా లేఖని సమర్పించాను. త్వరలోనే కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం"


- నితీశ్ కుమార్, జేడీయూ అధ్యక్షుడు 






నితీశ్ యూటర్న్‌పై ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ప్రతిపక్ష కూటమి తరపున ఆయన బలంగా నిలబడి ఉంటే కచ్చితంగా ప్రధాని అయ్యే వారని జోష్యం చెప్పారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అఖిలేశ్. ప్రతిపక్ష కూటమిలోని కీలక నేతలందరికీ ప్రధాని అభ్యర్థిగా నిలబడే అర్హత ఉందని, కానీ ఆ పదవికి సరైన వ్యక్తి నితీశ్ కుమార్ మాత్రమేనని అన్నారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.


Also Read: Supreme Court of India: సుప్రీం కోర్టులో 90 క్లర్క్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి