Bihar News:


మద్యానికి బానిసైన యువకుడు..


కొడుకు తప్పు చేసినా వెనకేసుకొస్తుంది అమ్మ. ఏదో సర్ది చెబుతుంది. కానీ..అందరు అమ్మలూ ఒకలా ఉండరు. కొడుకు తప్పు చేస్తే...మనసు చంపుకుని మరీ శిక్షిస్తారు. బిహార్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. జెహనాబాద్‌లో ఓ తల్లి తన తాగుబోతు కొడుకుని పోలీసులకు అప్పగించింది. స్థానికులంతా ఆమెపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తన కొడుకు మద్యం మత్తుకి బానిసైపోయాడని బాధ పడిన ఆ తల్లి... పరిష్కారమేంటోనని ఆలోచించింది. రోజూ తాగొచ్చి తల్లితో గొడవపడే వాడు. అతని తీరుతో విసిగిపోయిన తల్లి...దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్ చేసింది. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు...ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిజాముద్దీన్‌పురలోని రంజయ్ కుమార్...తన తల్లితో రోజూ పూటుగా మద్యం సేవించి గొడవ పడేవాడు. మందు తాగొద్దని తల్లి ఎంత బతిమాలినా ఆ యువకుడిలో మార్పు రాలేదు. అందుకే...పోలీసులకు ఫోన్ చేసి..దగ్గరుండి మరీ అరెస్ట్ చేయించింది. అదుపులోకి తీసుకున్న వెంటనే ఆ యువకుడిని సర్దార్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు పోలీసులు. వైద్య పరీక్షలు చేసి..మద్యం సేవించాడని నిర్ధరించుకున్నాక అరెస్ట్ చేశారు. ఆ తల్లి చేసిన పనికి పోలీసులు ప్రశంసించారు. మద్యనిషేధం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇలాంటి సంఘటనలు ఎంతో బలాన్ని చేకూర్చుతాయని అన్నారు. ఆమె ఈ  సమాజానికి ఎంతో గొప్ప సందేశం ఇచ్చారని పొగిడారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.."మద్య నిషేధం" అమలు చేస్తున్నారు. మద్యం సేవించడం వల్ల వాళ్ల ఆరోగ్యం పాడు కావడమే కాకుండా...వాళ్ల వల్ల ఇతరులకూ హాని జరుగుతోందని ఇలాంటి ఘటనలెన్నో నిరూపించాయి. కొన్ని ప్రాంతాల్లో మందుబాబులతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ముందుకొచ్చి వాళ్లను జైలుకు పంపుతున్నారు.


మద్యం మత్తులో హత్య..


ఇటీవల ఏపీలోని కర్నూలులోనూ మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కోసిగి మండల కేంద్రంలో  నర్సింహులు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వస్తూ.. మద్యం మత్తులో తల్లి దండ్రులను వేధించేవాడు. సహించలేని తండ్రి కొవ్వు ఈరయ్య పలుమార్లు మందలించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న నర్సింహులు.. ఎలాగైనా తండ్రిని హతమార్చాలకున్నాడు. ఫుల్లుగా తాగొచ్చాడు. మద్యం మత్తులోనే అర్ధరాత్రి పడుకున్న తండ్రి గొంతుపై గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా చంపాడు. అయితే విషయం గుర్తించిన భార్య రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వృద్ధాప్యంలో తమకు సాకాల్సిన కుమారుడు... తాగుడుకు బానిసై తండ్రిని చంపడాన్ని తట్టుకోలేకపోతుంది. తండ్రిని నరికి చంపిన తర్వాత రక్తపు మరకలతో ఉన్న గొడ్డలిని పట్టుకొని నర్సింహులు గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. అయితే అతడి అరాచకాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఇలాంటి దారుణాలెన్నో జరుగుతున్నాయి. 


Also Read: Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు? భారత్ ఉద్యోగులపైనా ఎఫెక్ట్!