Kashmir as Separate Country:

Continues below advertisement


బిహార్‌లో..


బిహార్‌లోని కిషన్‌గంజ్‌ ప్రాంతంలో ఓ స్కూల్‌లో ఏడో తరగతి ప్రశ్నాపత్రంలో అడిగిన ఓ క్వశ్చన్ వివాదాస్పదమైంది. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పరిగణిస్తూ ప్రశ్న అడగటంపై అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై స్కూల్ హెడ్‌మాస్టర్ స్పందించి "అనుకోకుండా జరిగిన తప్పు" అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. "బిహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి నేరుగా మాకు ఈ ప్రశ్నాపత్రాలు వచ్చాయి. "కశ్మీర్‌లో నివసించే వారిని ఏమని
పిలుస్తారు..? అన్న ప్రశ్నకు బదులుగా కశ్మీర్ దేశ ప్రజల్ని ఏమని పిలుస్తారు..? అని తప్పుగా ప్రింట్ అయింది. ఇది మానవ తప్పిదం" అని హెడ్‌మాస్టర్ ఎస్‌కే దాస్ వెల్లడించారు. "What are people of the following countries called?" అనే మల్టిపుల్‌ ఆన్సర్ క్వశ్చన్‌కి..."The people of Kashmir are called the..."అనే ఆప్షన్ కూడా కనిపించింది. దీనిపై భాజపా తీవ్రంగా మండి పడుతోంది. బిహార్ భాజపా అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "నితీశ్ ప్రభుత్వం కశ్మీర్‌ని భారత్‌లో భాగమని అంగీకరించటం లేదంటే...పీఎఫ్‌ఐతో వారికి సన్నిహిత సంబంధాలున్నాయని అర్థమవుతోంది" అని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 






తమిళనాడులోనూ..


అంతకు ముందు తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో ఓ క్వశ్చన్ పేపర్‌ వివాదాస్పదమైంది. అందులో క్యాస్ట్‌కి సంబంధించిన ప్రశ్న అడగటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్‌ఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్‌ పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగారు. "తమిళనాడులో ఎక్కువగా కనిపించే లోయర్ క్యాస్ట్ ఏంటి" అనే క్వశ్చన్ అందులో ఉంది. పైగా ఇదో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కావటం వల్ల నాలుగు ఆప్షన్స్‌లో నాలుగు క్యాస్ట్‌ల పేర్లు ముద్రించారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్ జగన్నాథన్...ఈ వివాదంపై స్పందించారు. ఇది ఎవరు చేశారో తప్పకుండా విచారణ జరుపుతామని వెల్లడించారు. హిస్టరీ మాస్టర్స్‌లో సెకండ్ సెమిస్టర్‌ ఎగ్జామ్‌లో ఈ క్వశ్చన్ అడిగారు. తమిళనాడు స్వాతంత్య్రోద్యమం( 1800-1947) అనే సబ్జెక్ట్‌లో ఈ ప్రశ్న వచ్చినట్టు వీసీ తెలిపారు. ఇది తాము తయారు చేసిన క్వశ్చన్ పేపర్ కాదని, వేరే యూనివర్సిటీ రూపొందిం చిందని చెప్పారు. ముందే ఈ విషయం దృష్టికి వచ్చుంటే ఈ తప్పిదం జరగకుండా చూసే వాడినని అన్నారు. "ఈ క్వశ్చన్ పేపర్ మేము తయారు చేయలేదు. ఎగ్జామ్ పేపర్స్ లీక్‌ అయ్యే అవకాశముందని, ముందుగా మేం ఆ పేపర్‌ను చదవం. ఈ వివాదాస్పద ప్రశ్నకు సంబంధించిన నాకెలాంటి సమాచారం అందలేదు. విచారణ జరిపి తీరుతాం" అని వీసీ జగన్నాథన్ స్పష్టం చేశారు. 


Also Read: బీజేపీ గెలిస్తే 3000 పెన్షన్ ఇస్తారా? గుజరాత్, కర్ణాటకలో లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు