Nitish Kumar Returns NDA: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ NDAలో చేరుతున్నారన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలూ ఇదే చెబుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఏదో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022లో NDAతో తెగదెంపులు చేసుకుని మహాఘట్‌బంధన్‌తో చేతులు కలిపారు నితీశ్. RJD మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది జరిగి ఏడాది పూర్తైంది. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏతోనే కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే...ఒకవేళ NDAతో పొత్తు పెట్టుకున్నప్పటికీ లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో BJPతో కలిసినప్పుడు ఎలా అయితే క్యాబినెట్ ఉందో ఇప్పుడూ అదే విధంగా కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నితీశ్‌ ఉన్నట్టుండి ఈ ఆలోచన చేయడానికి కారణం RJDపై ఆయనకున్న ఆగ్రహం. అటు లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన I.N.D.I.A కూటమిపైనా ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారట. ఇది చాలదన్నట్టుగా లాలూప్రసాద్ యాదవ్ కూతురు చేసిన ట్వీట్ కూడా కాస్త దుమారం రేపింది. పరివారవాద రాజకీయాలు అంటూ నితీశ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె చాలా ఘాటుగా స్పందించారు. ఫలితంగా రెండు పార్టీల మధ్య వైరం పెరిగింది. 


జనవరి 28న ప్రమాణ స్వీకారం..!


ఇక విపక్ష కూటమి విషయంలో ఆయన అసహనంగా ఉండడానికి కారణం...సీట్‌ల పంపకాల్లో కాంగ్రెస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం. ఎంతకీ తేల్చకపోవడం వల్ల నితీశ్‌ అసహనానికి గురవుతున్నారు. ఒక్క బిహార్‌లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అందుకే ఆయన కూటమి నుంచి బయటకు వచ్చేయాలని భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరో రెండు రోజుల్లో బీజేపీతో పొత్తుని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు. జనవరి 28న JDU,BJP కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే రోజున నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారట. సుశీల్ మోదీకి డిప్యుటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నాయి. గత రెండు రోజుల్లోనే అటు మమతా బెనర్జీ, ఇటు ఆప్‌ కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు నితీశ్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయి. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఓ కూటమి నుంచి మరో కూటమికి మారుతూ వచ్చారు. NDA,మహాఘట్‌బంధన్ మధ్యే అటూ ఇటూ తిరుగుతున్నారు. 2022లో ఆయన NDA నుంచి బయటకు వచ్చి RJD మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆయన మహాఘట్‌బంధన్‌ని వీడి NDAలో చేరిపోతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. జనవరి 30వ తేదీన ఈ యాత్ర బిహార్‌కి చేరుకుంటుంది. అయితే...ఈ యాత్రలో పాల్గొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తి చూపించడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 


Also Read: Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకల్లో హైలైట్‌గా 1,900 చీరల ప్రదర్శన, ఒక్కో శారీకి ఒక్కో స్పెషాల్టీ