AP Governor Abdul Nazeer Speech: రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా.. ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా పేదలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రశంసించారు. విజయవాడ (Vijayawada) ఇందిరా గాంధీ స్టేడియంలో ఆయన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్.. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. నాడు - నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత. ఐకమత్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కృషి చేయాలి. సంక్షేమ పాలనకు నా అభినందనలు.' అని పేర్కొన్నారు.


వారికి అభినందనలు


గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదొడుకులను ఎదుర్కొందని.. అలాంటి సమయంలో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలని గవర్నర్ నజీర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు చేపడుతున్నట్లు కొనియాడారు. 'రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది. విలేజ్ క్లినిక్స్ తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. అమ్మఒడి పథకంతో ప్రతీ పేద విద్యార్థీ చదువుకోగలుగుతున్నాడు. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతుంది. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ తో వైద్యం అభినందనీయం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుతుంది. 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. పరిపాలన సంస్కరణల్లో భాగంగానే 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం.' అని వివరించారు.


ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన


గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలిపేలా ఈ శకటాన్ని రూపొందించారు. గవర్నర్ సహా సీఎం దంపతులు శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అలాగే, సంక్షేమ పథకాల శకటాలు సైతం అబ్బురపరిచాయి.


అసెంబ్లీ వద్ద జెండా ఆవిష్కరణ


రిపబ్లిక్ డే పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ తమ్మినేని సీతారాం జెండా ఆవిష్కరించారు. శాసనమండలి ఆవరణలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్ర పటానికి స్పీకర్, మండలి ఛైర్మన్ నివాళి అర్పించారు. అటు, ఏపీ సచివాలయంలో ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Also Read: Padma Awards 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్ - పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం