Sai Kumari Aunty: "మీది వెయ్యి రూపాయలు అయ్యింది నాన్న.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా" ఇప్పుడు ఈ డైలాగ్‌ తెగ ఫేమస్‌. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఏది ఓపెన్‌ చేసినా దీనిపైనే ట్రోల్స్‌. ఆ రీల్స్‌లో కనిపిస్తున్న ఆంటీ పేరు సాయి కుమారి. అంతా ఆమెను కుమారి ఆంటీ అని పిలుస్తారు. దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన ప్రతిరోజు మీల్స్‌ అమ్మే ఈమె ఇప్పుడు సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అనే చెప్పాలి. ఎంతలా అంటే సాయికుమారి ఆంటి రోడ్‌సైడ్‌ మీల్స్‌ పాయింట్‌ దగ్గర సినిమావాళ్లు కూడా ప్రమోషన్స్ చేసుకునేంత. మరి రీల్స్‌లో ఆమెను ట్రోల్‌ చేస్తున్నట్లు సాయికుమారి ఆంటీ రోజుకి అంత సంపాదిస్తున్నారా? అసలు సంపాదన ఎంత? అన్ని వంటలు ఆవిడే చేస్తారా? వంటలు అసలు ఎక్కడ నేర్చుకున్నారు?


టెస్టీ ఫుడ్‌.. ఆమె సక్సెస్‌ సీక్రెట్‌


ఐటీసీ కోహినూరు దగ్గర్లో ఉన్న సాయికుమారి మీల్స్‌ పాయింట్‌ ఎప్పటి నుంచో చాలా ఫేమస్‌. కారణం ఆమె అందించే టేస్టీ ఫుడ్‌. ఆమె నవ్వుతూ పలకరించే తీరు. నిజానికి సాయికుమారి ఆంటీ ఫుడ్‌కి ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. ప్రముఖ య్యూట్యూబర్‌, యాంకర్‌ శివజ్యోతి ఒక వీడియో చేయడంతో ఆమె ఇంకా ఇంకా ఫేమస్‌ అయ్యారు. ఆ తర్వాత ప్రతి య్యూట్యూబ్‌ ఛానెల్‌వాళ్లు ఆమెతో వీడియోలు చేయడంతో సాయికుమారి ఆంటీ సోషల్‌మీడియా స్టార్‌ అయ్యారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ఆమె అంత టేస్టీ ఫుడ్‌ అందించడం వెనుక సీక్రెట్‌ ఏంటో ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 


"వంటల్లో వాడే పొడులన్నీ ఇంట్లోనే స్వయంగా తయారు చేస్తాను. అందుకే ఫుడ్‌ అంత టేస్ట్‌ ఉంటుంది. అసలు నాకు వంటలు రావు. కానీ, సింగర్‌ హేమచంద్ర తల్లే నాకు వంటలన్నీ నేర్పించారు. ఆమె దగ్గరే ఇంత టేస్ట్‌గా వంటలు చేయడం నేర్చుకున్నాను. నేను వాడేవన్నీ నంబర్‌ 1 క్వాలీటీ. అందరూ రేటే చూస్తున్నారు.. ఖర్చు చూడటం లేదు. నాపై వచ్చే ట్రోల్స్‌ చూసే టైం కూడా నాకు ఉండదు. తినేందుకు తిండి లేని స్థితి నుంచి ఇక్కడికి వచ్చాం. లక్షలు వస్తున్నాయని అంటున్నారు.. అన్ని లక్షలు వస్తే రేకులు ఇంట్లో ఉండం. రోజుకి 5 నుంచి ఆరువేలు మాత్రమే మిగులుతాయి. ఖర్చు చాలా ఉంటుంది. ఆరోజు ఆరుగురు వచ్చి తిన్నారు. లివర్‌ తీసుకున్నారు. వాళ్లకు మొత్తం కలిపి రూ.1000 అయ్యింది అన్నాను. దాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ట్రోల్స్‌ చూస్తే బాధవేయదు.. మనం చేసే మంచిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎదుర్కోవాలని మా అమ్మ చెప్పింది. మా ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన సపోర్ట్‌ వల్లే ఇంత పనిచేయగలుగుతున్నాను" అంటూ తన గురించి చెప్పారు సాయికుమారి.


రోజుకు 100 కిలోల చికెన్..


ప్రతి రోజు 100 కేజీల చికెన్‌, దాదాపు 10 కిలోల మటన్‌, బోటీ, తలకాయ కూర వండుతారు సాయికుమారి. అది మొత్తం కేవలం 2 గంటల్లోనే ఖాళీ అయిపోతుంది అంటే.. ఆమె క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఫుడ్‌ టేస్ట్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి మీరు ఆంటీ ఫుడ్‌ టేస్ట్‌ చేశారా?


Also read: గబ్బిలాలతో మధుమేహానికి మందు - ఆశలు పుట్టిస్తోన్న కొత్త పరిశోధన