Republic Day Parade 2024: ఈ సారి రిపబ్లిక్ డే వేడుకల్లో చాలా ప్రత్యేకతలు కనిపించాయి. తొలిసారి పరేడ్‌లో నారీశక్తి ప్రతిబింబించింది. దాంతో పాటు త్రివిధ దళాలు బలాబలాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కర్తవ్య్‌ పథ్‌లో మరో ప్రత్యేకత కూడా అందరినీ ఆకర్షించింది. సీటింగ్ ఏరియాలో వెనకాల దాదాపు 1,900 రకాల చీరలతో బ్యాగ్రౌండ్ తయారు చేశారు. దీనికి Anant Sutra అనే పేరు పెట్టారు. దేశంలోని నలుమూలలకు చెందిన రకరకాల డిజైన్‌ల చీరలను వెనకాల అందంగా అలంకరించారు. ఇందుకోసం చెక్కతో తయారు చేసిన ఫ్రేమ్స్‌ని ఏర్పాటు చేశారు. వాటిపైనే చీరలను అలంకరించారు. మరో స్పెషాల్టీ ఏంటంటే...ఆ చీరలపై QR కోడ్ కూడా పెట్టారు. దానిపై స్కాన్ చేయగానే...ఆ చీర డిజైన్, చరిత్ర, ఎంబ్రాయిడరీ వర్క్ వివరాలు కనిపిస్తాయి. ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఉత్సవాలతో పోల్చి చూస్తే ఈ సారి జరిగిన వేడుకలు చాలా స్పెషల్ అనే చెప్పాలి. పరేడ్‌లో తొలిసారి మహిళలు పెద్ద ఎత్తున మార్చ్ నిర్వహించడం అందులో ఒకటి. త్రివిధ దళాలకు చెందిన మహిళలు స్పెషల్ పరేడ్ చేశారు. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించారు. మేజర్ జెర్రీ బ్లాజీ, కేప్టెన్ సుప్రీత రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి జంటగా రికార్డు సృష్టించారు.