Bihar Bizarre Theft Cases: అవును, ఇది అక్షరాలా నిజం! బిహార్ పుణ్యభూమిలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సాధారణంగా దొంగలు ఇళ్లల్లోకి దూరి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లడం లాంటి బోరింగ్ క్రైమ్స్ చూసుంటారు. కానీ, బిహార్ దొంగల రూటే సెపరేటు. వాళ్లు చిన్న చిన్న వస్తువుల జోలికి అస్సలు వెళ్లరు. ఒకసారి ఏకంగా రైల్వే ఇనుప వంతెనను కరిగించి అమ్మేస్తారు, మరోసారి రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను పీకేసి గుట్టుచప్పుడు కాకుండా పట్టుకెళ్తారు. ఇప్పుడు అదే సిరీస్‌లో లేటెస్ట్ ఐటమ్‌గా, బక్సర్ జిల్లాలోని దుమ్‌రావ్ పట్టణంలో ఏకంగా 132 అడుగుల భారీ మొబైల్ టవర్‌ను , దానికి తోడు ఒక 15 KVA బరువైన డీజిల్ జనరేటర్‌ను కూడా మాయం చేసి వార్తల్లో నిలిచారు!
జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఓ ప్రైవేట్ టెలికాం సంస్థ 2010లో దుమ్‌రావ్ పట్టణంలోని హరేనాథ్ యాదవ్ అనే వ్యక్తి స్థలంలో ఈ 132 అడుగుల భారీ టవర్‌ను నాటింది. 12 ఏళ్ల అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కంపెనీ సదరు యజమానికి అద్దె కట్టడం మానేసింది. బాబూ.. నా అద్దె నాకివ్వండి అంటూ ఆ భూయజమాని కంపెనీకి నాలుగు సార్లు లీగల్ నోటీసులు పంపినా, ఆ టెలికాం కంపెనీ మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోయింది. కట్ చేస్తే.. ఇటీవలే సడన్‌గా నిద్ర లేచిన సదరు కంపెనీ ప్రతినిధులు, ఎక్కడో మూలన పడి ఉన్న ఆ పాత టవర్‌ను రిపేర్ చేద్దామని మెకానిక్‌లను తీసుకుని లొకేషన్‌కు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే.. అక్కడ టవర్ లేదు, జనరేటర్ లేదు.. కేవలం పచ్చటి గడ్డి, సిమెంట్ దిమ్మెలు మాత్రమే మిగిలాయి. దీంతో వారు హతాశులై గుండెలు బాదుకుంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశారు. సాధారణంగా ఒక చిన్న ఫోన్ పోతేనే లొకేషన్ ట్రాక్ చేసే పోలీసులు, ఇప్పుడు ఏకంగా నెట్‌వర్క్ ఇచ్చే 132 అడుగుల మొబైల్ టవరే మాయమవడంతో తలలు పట్టుకుంటున్నారు. దుమ్‌రావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో, అదీ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఇంత పెద్ద టవర్‌ను గ్యాస్ కట్టర్లతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి, లారీల్లో లోడ్ చేసుకుని వెళ్తుంటే.. చుట్టుపక్కల జనం ఏమనుకున్నారంటే, సదరు టెలికాం కంపెనీ వాళ్లే వచ్చి తమ టవర్‌ను డిస్మాంటిల్ చేసుకుంటున్నారని భావించి సైలెంట్‌గా ఉండిపోయారట! దొంగల క్రియేటివిటీని చూసి స్థానికులు సైతం అవాక్కవుతున్నారు.
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. దీనిపై ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టవర్ మాయమైన మాట నిజమే, దీనిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నాం, త్వరలోనే క్లారిటీ ఇస్తాం అని బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య చాలా సీరియస్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే దొంగల పనే అని కంపెనీ గగ్గోలు పెడుతుంటే, స్థానిక పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అద్దె కట్టకుండా ఎగ్గొట్టిన కంపెనీ తీరుతో విసిగిపోయిన భూయజమాని, ఆ టవర్‌ను, జనరేటర్‌ను స్క్రాప్ కింద అమ్మేసి తన అద్దె వసూలు చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. ఆ దిశగాదర్యాప్తుచేస్తున్నారు. ఇలాంటి వింతలు కేవలం బిహార్‌లోనే సాధ్యమని, భవిష్యత్తులో దొంగలు ఏకంగా సెక్రటేరియట్ బిల్డింగ్‌నో లేదా గంగా నదినో ఎత్తుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
