- గతంలో ఉన్న 180 నిమిషాల పరీక్షా సమయాన్ని 195నిమిషాలకు పెంచింది.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్కల కోసం రఫ్ వర్క్ పేజీలను 2 నుంచి నాలుగుకు పెంచింది.
- విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంది.
జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీటెస్ట్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా పరీక్ష అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ స్టూడెంట్ ఫ్రెండ్లీ నిర్ణయాలు తీసుకున్నట్టు ఎన్టీఏ స్పష్టం చేసింది. ముఖ్‌యంగా సమయపాలన, రఫ్ వర్క్ విషయంలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ కొత్త నిబంధనలు తొలగించనున్నాయి.
అదనంగా 15 నిమిషాల టైం
సాధారణంగా నీట్ పరీక్ష 3 గంటల పాటు జరుగుతుంది. కానీ ఈసారి దానిని 195 నిమిషాలకు పొడిగించారు. పరీక్షా సమయంలో అటెండెన్స్ మార్కింగ్, ఇన్విజిలేషన్ ప్రక్రియలు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ పనుల వల్ల విద్యార్థుల విలువైన సమయం వృథా అవుతోంది. ఈ అడ్మిస్ట్రేటివ్ పనుల వల్ల విద్యార్థులు సమాధానాలు రాసే సమయంలో ఎటువంటి కోత పడకూడదనే ఉద్దేశంతో 15నిమిషాలను అదనంగా కలిపారు. ఇప్పుడు పరీక్షా సమయం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు వరకు ఉంటుంది.
రఫ్ వర్క్ కోసం డబుల్ స్పేస్
నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలు విద్యార్థులకు సవాలుగా మారుతుంటాయి. వీటికి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అవసరమవుతాయి. గతంలో రఫ్ వర్క్ కోసం కేవలం రెండు పేజీలు మాత్రమే ఉండేవి. దీని వల్ల విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఈ పేజీల సంఖ్యను నాలుగుకు పెంచారు. అంటే విద్యార్థులకు లెక్కలు చేసుకునేందుకు రెట్టింపు స్థలం లభిస్తుంది. అంతేకాకుండా క్వశ్చన్ బుక్‌లెట్ చివరలోనే కాకుండా, ఇన్‌స్ట్రక్షన్ పేజీ తర్వాత వెంటనే రెండు పేజీలు చివరలో మరో రెండు పేజీలు కేటాయించారు ఈ సౌకర్యం ఇంగ్లీష్‌తోపాటు అన్ని ప్రాంతీయ భాషల క్వశ్చన్ పేపర్లలోనూ అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది.
కఠిన భద్రతా చర్యలు
నీట్ యూజీ 2026 పరీక్షపై లీక్ ఆరోపణలు రావడంతో పాత పరీక్షను రద్దు చేసి, ఈ రీటెస్టు నిర్వహిస్తున్నారు. అందుకే ఈసారి పరీక్ష నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఎన్టీఏ అమలు చేస్తోంది. స్ట్రిక్ట్ మానిటరింగ్, పటిష్టమైన లాజిస్టిక్స్ ద్వారా పరీక్ష పారదర్శకతను కాపాడాలని అధికారులు నిర్ణయించారు. చిన్నపాటి మార్పులు కూడా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారు ప్రశాంతంగా పరీక్ష రాసేలా చేస్తాయని ఎన్టీఏ నమ్ముతోంది.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదవాలని ఎన్టీఏ కోరింది. పరీక్షా కేంద్రాల్లో సిబ్బందికి సహకరిస్తూ, సకాలంలో కేంద్రానికి చేరుకోవడం చాలా అవసరం. జూన్ 21న జరిగే ఈ పరీక్ష అభ్యర్థుల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక ఘట్టం కావడంతో ప్రతి నిమిషాన్ని సద్వినియోగ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ ఫార్మాలిటీస్ గురించి ఆందోళన చెందకుండా పూర్తిగా పరీక్షపైనే దృష్టి పెట్టవచ్చు.
