జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి దిల్లీకి విచ్చేస్తున్న దేశాధినేతల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి బస కోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య లగ్జరీ హోటళ్లను సిద్ధం చేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల అధినేతలు, అధికారులు, వారి వారి సిబ్బంది ఇలా చాలా మంది దేశానికి వస్తున్నారు. ప్రపంచ అధినేతలు సెప్టెంబరు 9, 1౦ తేదీల్లో దేశ రాజధానిలో బస చేయనున్నారు. దేశాధినేతలు బస చేసే ప్రాంతాలు, వారు ప్రయాణించే మార్గాలలో పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దిల్లీ, గుర్గావ్ ప్రాంతాలలో హోటళ్లలో దాదాపు 3500 గదులు అతిథుల కోసం బుక్ అయ్యాయి. 19 దేశాల నుంచి అధినేతలు, వారి భాగస్వాములు దిల్లీకి వస్తున్నారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా అతిథులు దిల్లీకి వస్తున్నారు.
ఏయే దేశాధినేతలు ఎక్కడెక్కడ ఉంటున్నారంటే..?
* అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిల్లీలోని ఐటీసీ మౌర్య షెరెటన్‌లో బస చేయబోతున్నారు. అందులో సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ప్రతి ఫ్లోర్‌లో ఉంటారు. బైడెన్‌ను 14వ అంతస్థులోని తన గదికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక లిఫ్ట్‌ను వాడనున్నారని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
* యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ కన్నౌట్ ప్రాంతంలోని షాంగ్రిలా హోటల్‌లో ఉండనున్నారు. జర్మనీకి చెందిన ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ సహా పలువురు ప్రతినిధులు కూడా ఈ హోటల్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.
* కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో , మరికొందరు జపాన్‌కు చెందిన ప్రతినిధులు ది లలిత్ హోటల్‌లో బస చేయనున్నారు.
* చైనా నుంచి వస్తున్న ప్రతినిధులు, అధికారులు తాజ్ ప్యాలెస్‌లో ఉండనున్నారు. ప్రీమియర్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ లీ కియాంగ్ నేతృత్వంలోని బృందం చైనా నుంచి జీ20 సమావేశాలకు వస్తున్నారు. చైనా అధినేత జీ జిన్‌పింగ్ సదస్సుకు రావడం లేదు.
* బ్రెజిల్ నుంచి రానున్న ప్రతినిధులు చాణక్యపురిలోని తాజ్ ప్యాలెస్‌లో బస చేయనున్నారు.
* ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ మాక్రాన్ మోతీ లాల్ నెహ్రూ మార్గ్‌లోని క్లారిడ్జెస్ హోటల్‌లో ఉండబోతున్నారు.
* ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ కన్నౌట్ ప్రాంతంలోని ఇంపీరియల్ హోటల్‌లో బస చేస్తారు.
* టర్కీకి చెందిన ప్రతినిధులు ఒబెరాయ్ హోటల్‌లో ఉంటారు.
* ఇటలీ నుంచి వచ్చే అధికారులు రెండు హోటల్స్‌లో ఉండబోతున్నారు. దిల్లీలోని ఏరోసిటీ ప్రాంతంలో ఉన్న జేడబ్ల్యూ మారియట్, భికాజీ కామా ప్రాంతంలోని హయత్ రెసిడెన్సీలలో ఉంటారు.
* నెదర్లాండ్స్, నైజీరియా, యూరోపియన్ యూనియన్‌ల నుంచి వస్తున్న ప్రతినిధులు జనపథ్ ప్రాంతంలో ఉన్న లే మెరిడియన్‌లో బస చేస్తున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో పాటు వారి ప్రతినితిధులు లీలా ప్యాలెస్‌లో బస చేయనున్నారు.