తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త రాజకీయ పార్టీలు రాబోతున్నాయి. తెలంగాణ ఒకటి, ఏపీలో మరో పార్టీ...కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే...ఈ నెల 20లోగా తెలియజేయాలని ఈసీ వెబ్ సైట్ లో తెలియజేసింది. సెక్షన్ 29ఎ పీపుల్స్ రెప్రజంటేషన్ చట్టం ప్రకారం....పార్టీని రిజిస్టర్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. అటు క్రిష్ణ జిల్లా కంచికర్లకు వ్యక్తి...తెలుగు రాజ్యాధికార పార్టీ పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు.
ఆరు జాతీయ పార్టీలు, తెలంగాణలో నాలుగు గుర్తింపు పార్టీలతో పాటు107 గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. 70 పార్టీలు ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేసుకున్నాయి. తీన్మార్ మల్లన్న ..కొత్త పార్టీ పెడుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత ఏప్రిల్ లో పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. త్వరలో తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందన్న తీన్మార్ మల్లన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి విద్య, వైద్యంతో పాటు సత్వర న్యాయం కోసం పోరాటం చేసేందుకే పార్టీ పెట్టినట్లు తెలిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మేడ్చల్ నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. తెలంగాణ నిర్మాణ పార్టీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినా తమకేం సంబంధం లేదన్నారు. తాము కేసీఆర్ కు మాత్రమే వ్యతిరేకమని...ప్రతిపక్ష పార్టీలకు కాదని స్పష్టం చేశారు. తమతో కలిసి పని చేసేందుకు ఏ ప్రతిపక్ష పార్టీ ముందుకు వచ్చినా...స్వాగతిస్తామన్నారు.
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో...1982, జనవరి 17న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. హైదరాబాద్ జెఎన్టీయూ నుంచి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పలు న్యూస్ ఛానెల్స్ లలో పని చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో వి6 ఛానెల్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా నవీన్ కాస్త తీన్మార్ మల్లన్నగా సుపరిచితుడయ్యారు.
2015లో నల్గొండ -ఖమ్మం –వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021 మార్చిలో నల్గొండ –ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. కొంతకాలం పాటు బీజేపీలో పని చేశారు. ప్రస్తుతం క్యూ గ్రూప్ మీడియాను నిర్వహిస్తున్నారు.