Bharat Jodo Yatra Conclusion: 


మంచుతో ఆటలు..


కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన "భారత్ జోడో యాత్ర" నేటితో ముగియనుంది. కన్యాకుమారిలో మొదలైన యాత్ర..కశ్మీర్‌లో ముగుస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కశ్మీర్‌కు చేరుకున్నారు. తీవ్రంగా మంచు కురుస్తున్నప్పటికీ...భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మంచులో కాసేపు సేదతీరారు. ఒకరిపై ఒకరు మంచు విసురుతూ సరదాగా గడిపారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర...గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన మొదలైంది. ఈ క్రమంలో మొత్తం 12 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలనూ కవర్ చేశారు రాహుల్. 5 నెలల పాటు సాగిన యాత్ర కశ్మీర్‌లో భారీ సభతో ముగుస్తుంది. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద యాత్ర ముగిసింది. అక్కడే జాతీయ జెండా ఎగరేశారు రాహుల్ గాంధీ. షేర్ - ఎ కశ్మీర్‌లో మైదానంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు విపక్షాల నేతలు హాజరు కానున్నారు. పార్టీకి అండగా ఉన్న వారందిరినీ ఒక్కతాటికి తీసుకురావడం సహా...అసలైన సమస్యల్ని దేశ ప్రజల ముందుకు తీసుకురావడంలో భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ మొత్తం యాత్రలో రాహుల్ గాంధీ 12 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 100 వరకూ సమావేశాలు నిర్వహించారు. 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేశారు. 






కాంగ్రెస్ బలంగా ఉంది..


భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల బలం, పరిస్థితిని చూసిందని.. దేశ రాజకీయాలపై తన పాదయాత్ర ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించిందన్నారు. తన ఈ పాదయాత్ర ప్రయాణంలో ప్రజల దృఢత్వం, బలాన్ని చూశానన్నారు. దేశంలో రైతులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని, స్వయంగా చూశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్య, ఆక్రమణపై సైతం రాహుల్ స్పందించారు. చైనా సైన్యం మన భూమిని ఆక్రమించిందని అంగీకరించడానికి నిరాకరించే కేంద్ర ప్రభుత్వ విధానం అత్యంత ప్రమాదకరం అన్నారు. చైనాతో మన దేశం మరింతగా పోరాడి మన భూమిని పరాయి దేశస్తుల పరం కాకుండా చూడాలన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతపై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా.. ‘మీడియా ఒకే పక్షానికి, కొన్ని వర్గాలకు అవకాశం ఇస్తోంది. అందరినీ ఒకేలా చూడటం లేదు. సమస్యలను సరైన రీతిలో ప్రజలకు తెలియజేప్పాల్సిన అవసరం ఉందన్నారు. 


Also Read: Pravin Togadia: జనాభా నియంత్రణ లేకపోతే అయోధ్య రామ మందిరానికి భద్రత ఉండదు - హిందూ నేత సంచలన వ్యాఖ్యలు