మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడలో అర్థరాత్రి హంగామా కనిపించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కో ఆప్షన్ మెంబర్, బిల్డర్‌ జగదీశ్వర్‌ రెడ్డి ఆఫీస్‌కి కొంతమంది ప్రముఖులు వచ్చారు. వాళ్లలో పీర్జాదీగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కొప్పుల అంజిరెడ్డి సహా మొత్తం ఆరుగురు కార్పొరేటర్లు ఉన్నారు. మరికొందరు కార్పొరేటర్ల భర్తలు, ఇంకొంతమంది పెద్ద బిల్డర్లు ఉన్నారు. దాదాపు పది మందికిపైగా పేకాట స్థావరం ఏర్పాటు చేశారు. ఈ విషయం ఎవరో పోలీసులకు చెప్పడంతో సరిగ్గా రాత్రి 8 గంటల తర్వాత పోలీసులు వారి దగ్గరికి వచ్చారు.


ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు వచ్చిన సంగతి తెలుసుకున్న లోపల ఉన్న వ్యక్తులు కొద్దిసేపు తలుపు తెరవకుండా ఇబ్బందిపెట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా లోపలికి చొచ్చుకుపోయి తలుపులు మూసివేశారు. రాత్రి 8 గంటల సమయంలో దాడి చేసిన పోలీసులు లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని రాత్రి 11.30 గంటల వరకు తలుపులు తీయలేదు. దీంతో మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు కొంత మంది వెళ్లిపోయినట్లుగా కనిపించింది. లోపల ఇంకా ఎస్‌ఓటీ పోలీసులు ఉన్నారు. మీడియా అక్కడి నుంచి కదల్లేదు. 


ఈలోగా అదే ప్రాంతంలో కరెంట్ పోయింది. పిర్జాదీగూడ మొత్తం కరెంటు ఉన్నా సరిగ్గా అదే ప్రాంతంలో విద్యుత్ ఆగిపోవడం అనుమానాలకు తావిస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు కరెంట్ రాలేదు. అయినా కూడా మీడియా అక్కడి నుంచి కదలకపోవడంతో సదరు ప్రజాప్రతినిధుల అనుచరులు పదుల సంఖ్యలో వచ్చారు. కొంతమంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. కెమెరాలు కూడా లాక్కున్నారు. దాడి కారణంగా మిగతా వారు కనీసం కెమెరాలు కూడా బయటకు తీసే పరిస్థితి లేదు. అర్ధరాత్రి సమయంలో కరెంటు లేనప్పుడు లోపల ఉన్న ప్రజాప్రతినిధులు, బిల్డర్లు తమ వాహనాల్లో వెళ్లిపోయారు.


మేం పార్టీ కోసం కలిశాం - డిప్యూటీ మేయర్


మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి సంవత్సరీకం ఉంటే పార్టీ ఇచ్చారని డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తెలిపారు. ఆ పక్కనే తన ఆఫీసు ఉంటే కార్పొరేటర్లు అందరం మాట్లాడుకుంటున్నామని తెలిపారు. ‘‘పక్కనే కోఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసు ఉంది. అక్కడ గొడవలు జరుగుతుంటే మేం అక్కడికి వెళ్లాం. కొంత మంది పేకాట ఆడుతుంటే ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. జగదీశ్వర్ రెడ్డి డ్రైవర్లు, వాళ్ల అనుచరులు ఎవరో పేకాట ఆడుకుంటున్నారు. వాళ్లని అరెస్టు చేశాక నేను అప్పుడే 8 గంటలకే బయటికి వచ్చేశాను. అనవసరంగా మీడియా వాళ్లే రాద్ధాంతం చేస్తున్నారు. మేం అందరం కలిసి పార్టనర్‌ షిప్ బిజినెస్ చేస్తాం. సుధీర్ రెడ్డి తల్లి సంవత్సరీకం ఉన్న సందర్భంగా అందరం కలిసి మాట్లాడుకున్నాం. రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే తమపై ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు’’ అని డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తెలిపారు.