Rahul Gandhi on BJP:


జోడో యాత్రకు ప్రతిపక్షాల మద్దతు ఉంది : రాహుల్ 


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..బీజేపీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఉద్దేశపూర్వకంగా తన చుట్టూ ఓ గోడను కట్టి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. పదేపదే సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ ఉల్లంఘిస్తున్నారంటూ CRPF చెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పదేపదే లేఖలు పంపిస్తూ తమ యాత్రను ఆపేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో బీజేపీ రోడ్‌షోల గురించీ ప్రస్తావించారు. కొవిడ్ ప్రోటోకాల్స్‌ వాళ్లకు మాత్రం వర్తించవా అంటూ ప్రశ్నించారు. "బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌లో తిరగాలనిహోం శాఖ  చెబుతోంది. అదెలా సాధ్యమవుతుంది..? నడుచుకుంటూ యాత్ర చేయాలి. సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేయాలన్నది వాళ్లకు తెలిసే ఉంటుందిగా. కావాలనే దీన్ని ఇష్యూ చేస్తున్నారు" అని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీతో పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. "ప్రతి ప్రతిపక్ష నేత భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలబడుతున్నారు. కానీ..కొన్ని పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి" అని వెల్లడించారు. రాజకీయాల్లో ఏమేం చేయకూడదో నేర్పిస్తున్న బీజీపేయే తనకు గురువు అని సెటైర్లు వేశారు. 






ప్రతిపక్ష నేతలందరూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. "భారత్ జోడో యాత్రలో ఎవరైనా పాల్గొనచ్చు. ఎవరూ వచ్చినా ఆపం. ప్రేమపూర్వక భారత్‌ కోసం పరితపిస్తున్న వాళ్లెవరైనా సరే రావచ్చు. అఖిలేష్ యాదవ్, మాయావతి...ఇలా ఎవరైనా సరే" అని తెలిపారు. 2024 ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. విద్వేషాలు లేని భారత్‌ తమ లక్ష్యమని తెలిపారు. "జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి సమస్యల గురించి ప్రజలంతా చర్చించుకునేలా చేయగలిగాం" అని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీకి ధన బలం ఉన్నా... నిజంతో పోరాడి గెలవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. 


సీఆర్‌పీఎఫ్ వివరణ..


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గురువారం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ చేసిన భద్రతా లోపాల ఆరోపణలను  CRPF తోసిపుచ్చింది. 
" రాహుల్ గాంధీకి నిర్దేశించిన భద్రతా మార్గదర్శకాలను ఆయన ఉల్లంఘించినట్లు అనేక సందర్భాల్లో గమనించాం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్లాం.                 "
-     సీఆర్‌పీఎఫ్ ప్రకటన 


దిల్లీలో 'భారత్ జోడో యాత్ర' సందర్భంగా "భద్రతా ఉల్లంఘనలు" జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ సహా యాత్రలో పాల్గొనే వారికి తగిన భద్రతను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ లేఖకు ప్రతిస్పందనగా సీఆర్‌పీఎఫ్ వివరణ ఇచ్చింది.