Drunken Drive: హైదరాబాద్ న్యూఇయర్ వేడుకలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ముగియనున్న 2022కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు మందుబాబులు సిద్ధమయ్యాయ. అయితే మందుబాబులకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు హైదరాబాద్ పోలీసులు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే రూ. 10 వేల ఫైన్ విధిస్తామని తెలిపారు. దీంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకల జోష్ లో ర్యాష్ డ్రైవింగ్, ట్రిఫుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డిసెంబరు 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బేగంపేట్‌, లంగర్‌హౌస్‌ మినహా అన్ని ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.


పట్టుబడితే రూ.10 వేల ఫైన్ 
 
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చట్ట ప్రకారం చ‌ర్యలు తీసుకుంటామ‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఫస్ట్ టైం రూ.10 వేలు ఫైన్, 6 నెల‌లు జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు జ‌రిమానా, 2 సంవ‌త్సరాల జైలు శిక్ష త‌ప్పద‌ని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. డ్రైవింగ్ లైస్సెన్స్ సీజ్ చేసి స‌స్పెన్షన్‌కు ర‌వాణా శాఖ‌కు పంపుతామ‌ని వెల్లడించారు. మొద‌టిసారి 3 నెల‌ల స‌స్పెన్షన్, రెండోసారి దొరికితే పర్మినెంట్ గా లైసెన్స్ ర‌ద్దు చేస్తామని స్పష్టం చేశారు.
వాహనదారులు నిబంధనలు తప్పక పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని డీసీపీ కోరారు. 


అన్ని ఫ్లైఓవర్లు బంద్ 
 
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఆంక్షలు విధించారు.  నగరంలోని పలు ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. బేగంపేట, లంగర్‌హౌస్‌ ఫ్లై ఓవర్లను మాత్రం ఓపెన్ చేసి ఉంచుతారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై వాహనాలకు అనుమతి లేదు. శనివారం రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు, బస్సులు, భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని వెల్లడించారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే నుంచి రాకపోకలకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.


అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు 


శనివారం అర్ధరాత్రి 1 గంట వరకు నగరంలో మెట్రో రైళ్లను నడుపుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. కొత్త ఏడాది నేపథ్యంలో శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు తిరుగుతాయని వెల్లడించారు. చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరి చివరి స్టేషన్‌కు 2 గంటలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశామని మెట్రో రైల్ ఎండీ చెప్పారు.