సినిమా రివ్యూ : కోరమీను
రేటింగ్ : 3/5
నటీనటులు : ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోరీ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్ త‌దిత‌రులు
పాటలు : పూర్ణాచారి, లక్ష్మీ ప్రియాంక 
ఛాయాగ్రహణం : కార్తీక్ కొప్పెర
స్వరాలు : అనంత నారాయణన్ ఏజీ  
నేపథ్య సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని
నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి
కథ, కథనం, మాటలు : ఆనంద్ రవి 
దర్శకత్వం : శ్రీపతి కర్రి 
విడుదల తేదీ: డిసెంబర్ 31, 2022


'ప్రతినిధి' చిత్రంతో ఆనంద్ రవి (Anand Ravi) రచయితగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. విజయం అందుకున్నారు. ఆ తర్వాత 'నెపోలియన్'తో రచయితగా, కథానాయకుడిగా మరోసారి మెరిశారు. ఇప్పుడు ఆయన కథ అందించడంతో పాటు కథానాయకుడిగా నటించిన సినిమా 'కోరమీను' (Korameenu Movie). ఈ ఏడాది (2022)లో థియేటర్లలో విడుదలైన చివరి చిత్రమిది. ఇందులో హరీష్ ఉత్తమన్, శత్రు ప్రధాన పాత్రధారులు. కిశోరీ ధాత్రక్ కథానాయికగా పరిచయమయ్యారు. మీసాలు ఎవరు తీసేశారు? ఎందుకు? అంటూ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. మరి, ఈ సినిమా (Korameenu Review) ఎలా ఉంది? 


కథ (Korameenu Movie Story) : విజయవాడలో నేరస్థుల పాలిట సింహస్వప్నమైన, ఎన్నో ఎంకౌంటర్లు చేసిన మీసాల రాజు (శత్రు) విశాఖకు ట్రాన్స్‌ఫర్‌ అవుతారు. సిటీలోకి వచ్చిన రోజునే జాలరిపేట బ్రిడ్జ్ దగ్గర ఎవరో అతడి మీసాలు తీసేస్తారు. పరువు పోయిందని పగతో రగులుతున్న శత్రు, మీసాలు తీసింది ఎవరో అని ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు జాలరిపేట యువరాజులా ఫీలయ్యే కరుణ (హరీష్ ఉత్తమన్) గురించి తెలుస్తుంది. 


ఓ అమ్మాయి మీను అలియాస్ మీనాక్షి (కిశోరీ ధాత్రక్) విషయంలో తన డ్రైవర్ కోటి (ఆనంద్ రవి)తో కరుణ గొడవ పడతాడు. మీను, కోటి ప్రేమలో ఉన్నారని తెలిసి కూడా రాత్రికి ఆమెను తీసుకు రమ్మని కరుణ చెబుతాడు. లేదంటే జాలరిపేట ఖాళీ చేసి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తాడు. ఆ ఏరియాలో కరుణను కాదని ఎవరూ ఏమీ చేయలేరు. పైగా, మీను కోసం కరుణకు వ్యతిరేకంగా బోటు లీజుకు తీసుకుని వ్యాపారం చేయాలని కోటి ప్రయత్నాలు చేస్తాడు. మీసాల రాజు విశాఖకు రావడానికి ముందు రోజు నుంచి మీను, కోటి, కరుణ కనిపించకుండా పోతారు. వాళ్ళ ముగ్గురూ ఏమయ్యారు? మీసాల రాజు మీసాలు తీసేసినది ఎవరు? ఎవరు వేసిన వలలో ఎవరు పడ్డారు? అనేది మిగతా సినిమా.  


విశ్లేషణ : 'అవును... ఆ ఏరియాలో ఇలా జరిగిందట', 'ఇది మన మట్టి కథ' అని థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు పక్కనున్న స్నేహితులతో చెప్పే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కోవలో 'కోరమీను' ఉంటుంది.


'కోరమీను' కథలో పాత్రలన్నీ కల్పితంగా కనిపించవు. జాలరిపేట విశాఖలో కాదు... సముద్రతీర ప్రాంతంలో ప్రతి ఊరును ప్రతిబింబించేలా ఉంది. పాత్రలు చేసిన నటీనటులు మన ఊరిలో మనుషుల్లా కనిపిస్తారు. సహజంగా సినిమాను తెరకెక్కించారు. ప్రారంభం సాధారణంగా ఉంటుంది. ప్రతి ఊరిలో ఓ విలన్, ఓ సామాన్యుడు ప్రేమలో పడటం, అమ్మాయి మీద విలన్ మనసు పడటం... ఇంతే! కానీ, అసలు కథ అరగంట తర్వాత మొదలవుతుంది.


'కోరమీను'లో ప్రేమకథ ఉంది. అయితే, రెగ్యులర్ ప్రేమ కాదు. ప్రేమలో సెకండ్ హ్యాండ్ లేదని ఆనంద్ రవి చెప్పారు. కొన్ని సన్నివేశాల్లో హీరో వెనుక పెయింటింగ్ కనిపిస్తుంది. అందులో వాలి, సుగ్రీవుల యుద్ధం ఉంటుంది. దేవుడు కూడా కొన్నిసార్లు దొంగచాటుగా యుద్ధం చేశాడని చెప్పారు. తమ ప్రేమ కోసం, తమ ఊరిలో ఉండటం కోసం హీరో ఎలా యుద్ధం చేశాడనేది కథలో కీలకమైన అంశం. ఇంత కంటే ఎక్కువ చెబితే ట్విస్టులు రివీల్‌ అవుతాయి.


'కొరమీను'లో సహజత్వం ఉంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. అలాగే, ఆనంద్‌ రవి రాసిన కథ, కథనం, మాటలు. దర్శకుడు శ్రీపతి కర్రి నేటివ్ ఫీల్ వచ్చేలా సినిమా తీశారు. మరి, సినిమాలో మైనస్‌ పాయింట్స్‌ ఏమీ లేవా? అంటే... కొన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఫాస్ట్‌ పేస్డ్‌ మూవీస్‌కు అలవాటు పడిన ప్రేక్షకులకు స్లోగా అనిపించవచ్చు. కొత్తగా ఏముంది? ఇటువంటి కథలు చూశామని కూడా అనిపించవచ్చు. కథలో చెప్పిన విషయం కొత్తది కాకపోచ్చు. సీత కోసం రాముడు యుద్ధం చేశాడు. చరిత్రలో ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇదీ అటువంటి కథే. కాకపోతే... కథను చెప్పిన తీరు కొత్తగా ఉంది. ఇంటర్వెల్‌లో చిన్న ఫైట్‌ కూడా లేకుండా హీరోయిజం చూపించారు. క్లైమాక్స్‌కు ముందు ట్విస్టులు సర్‌ప్రైజ్‌ చేస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కాసేపు కాలక్షేపం చేసినట్లు ఉంటుంది. నిడివి కొంచెం తగ్గించి ఉంటే బావుండేది. అప్పుడు సినిమా పరుగులు పెట్టేది.


నటీనటులు ఎలా చేశారంటే? : ఆనంద్ రవి ఎక్కడా హీరోయిజం చూపించాలని ప్రయత్నించలేదు. అయితే, ఆయన రాసిన కథలో హీరోయిజం ఉంది. కొన్ని సన్నివేశాల్లో సాధారణ పౌరుడు సైతం హీరోలా ఫీలయ్యే కంటెంట్ ఉంది. క్యారెక్టర్‌ మాత్రమే కనిపించేలా ఆయన నటించారు. హరీష్‌ ఉత్తమన్‌ మరోసారి మాంచి విలన్‌ రోల్‌ చేశారు. ఆయనకు ఇచ్చిన కొన్ని ఎలివేషన్స్‌ చూస్తే హీరోలా ఉన్నాయి. కిశోరీ ధాత్రక్‌ సహజంగా నటించారు. శత్రు నటనలో ఇంటెన్సిటీ ఉంది. రాజా రవీంద్ర, ఇందు కుసుమ, గిరిధర్‌ తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు. 'జబర్దస్త్‌'లో కామెడీ చేసే ఇమ్మాన్యుయేల్‌... ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించారు. 'కొరమీను' తర్వాత అతడికి కామెడీ రోల్స్‌ కాకుండా మంచి క్యారెక్టర్లు పడే అవకాశం ఉంది.  


Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'కోరమీను' మట్టిలోంచి పుట్టిన కథ. మంచి పాటలు, నేపథ్య సంగీతం, మాటలు ఉన్న సినిమా. తెరపై నటీనటులు కాకుండా క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తారు. 'రంగస్థలం' జానర్ ఫిల్మ్. ఇందులో స్టార్స్ లేరు కానీ, చక్కటి నేటివ్ ఫీల్ ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మధ్య కొత్తగా తీసిన సినిమా చూడాలని ఆశించే ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్. 


Also Read : 'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?