బంగాల్ రాజకీయం మరోసారి వేడెక్కింది. భవానీపుర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురు భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘర్షణలో ఒకరి చేతిలో తుపాకీ కనబడటం కలకలం రేపింది.
దిలీప్ ఘోష్ ప్రచారం..
భవానీపుర్‌లో భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రియాంక తిబ్రేవాల్ తరఫున ప్రచారం చేసేందుకు పార్టీ ఎంపీ దిలీప్ ఘోష్ వచ్చారు. జాడు బాబుర్ బజార్ వద్ద దిలీప్ ఘోష్‌ను టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన్ను రోడ్డు పక్కకు నెట్టేసినట్లు భాజపా ఆరోపించింది. ఆయన్ను తిరిగి వెళ్లిపోవాలని టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ సమయంలో దిలీప్ ఘోష్ భద్రతా సిబ్బంది తమ సర్వీస్ రివాల్వర్‌ను టీఎంసీ కార్యకర్తలకు గురిపెట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
బంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదు..
ఈ ఘటనపై స్పందించిన దిలీప్ ఘోష్.. బంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు.
ఖండించిన టీఎంసీ..
భాజపా విమర్శలను టీఎంసీ ఖండించింది. భవానీపుర్‌లో ఓటమి భయంతోనే భాజపా ఇలాంటి ఆరోపణలు చేస్తుందని టీఎంసీ ఆరోపించింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది.