అనంతపురం జిల్లా ఖనిజాలకు నిలయం. రాయలసీమ రతనాల సీమ అనే నానుడి కూడా ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఖనిజాన్వేషణ విభాగం చేపట్టిన ఓ అధ్యయనంలో ఇది రుజువైంది. అనంతపురం జిల్లా భూగర్భంలో 16 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తేల్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో పది గ్రాముల బంగారం విలువ రూ.50 వేలకు చేరువైంది. ఈ లెక్కన 16 టన్నుల బంగారం విలువ రూ.800 కోట్లు ఉంటుందని నిపుణులు అంటున్నారు. టన్ను మట్టిలో 4 గ్రాముల బంగారం ఉన్నట్లు చెబుతున్నారు.
Also Watch:‘‘జగనన్నా.. పగటిపూట కరెంటు ఇస్తానంటివే..’’ ఆవేదనతో రైతు సెల్ఫీ వీడియో
గతంలోనూ తవ్వకాలు
అనంతపురం జిల్లాలోని మూడు చోట్ల బంగారం నిక్షేపాలను పరిశోధకులు గుర్తించారు. రామగిరి మండల కేంద్రానికి సమీపంలోని రెండు చోట్ల, రొద్దం మండలంలోని బొక్సంపల్లి వద్ద రెండు చోట్ల, కదిరి మండలం జౌకుల పల్లి దగ్గర ఆరు చోట్ల, మొత్తంగా 7.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. వాస్తవానికి రామగిరి సమీపంలో బంగారం నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. అప్పట్లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ ఇక్కడ బంగారం నిక్షేపాల తవ్వకాలు జరిపింది. అయితే అప్పట్లో గ్రాము బంగారం మార్కెట్ విలువతో పోలిస్తే తవ్వేందుకు అయ్యే ఖర్చు మొత్తం నాలుగైదు రెట్లు ఉండడంతో ఆ సంస్థ తవ్వకాలను నిలిపివేసింది. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో ఇప్పుడు తవ్వకాలు చేపడితే కచ్చితంగా గిట్టుబాటవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: జేసీ వర్సెస్ కాల్వ ! అనంత టీడీపీలో పెరిగిపోతున్న గ్రూపుల గోల !
ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి
ప్రస్తుతం బంగారం నిక్షేపాలను గుర్తించిన పది ప్రాంతాల్లో మరింత అన్వేషణ, అధ్యయనాల కోసం కాంపొజిట్ లైసెన్సులు మంజూరు చేయాలని గనుల శాఖ యోచిస్తోంది. ఎవరైనా వ్యక్తికి లేదా సంస్థకు వెయ్యి హెక్టార్ల పరిధిలో ఈ కాంపొజిట్ లైసెన్స్ ఇస్తారు. దీనికి సంబంధించిన ఈ-వేలం ప్రక్రియను త్వరలోనే చేపట్టనున్నారు. ఆ తర్వాత గనుల తవ్వకానికి అనుమతులు మంజూరు చేస్తారు. ఈ గనుల్లో బంగారం నిక్షేపాల వెలికితీత ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధితో పాటు, రాయల్టీ రూపంలో భారీ మొత్తం జిల్లాకు సమకూరే వీలుంది. దీంతో కరవు సీమ స్వర్ణ భూమిగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు.
Also Read: అనంతపురం పెన్షన్‌దారుల్లో టెన్షన్.. ఒక్క నెలలో 20 వేల పింఛన్లు ఔట్.. వచ్చే నెలలోనూ ఇంతేనా?