Bengaluru Water Crisis Updates: బెంగళూరులో నీటి కొరత ఎంత దారుణంగా ఉందో అక్కడి రోడ్లని గమనిస్తేనే అర్థమవుతోంది. దాదాపు అన్ని చోట్లా వాటర్ ట్యాంకర్‌లే కనిపిస్తున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకోడానికి వీలైనన్ని మార్గాలు చూసుకుంటున్నారు బెంగళూరు వాసులు. ఇంట్లో వంట వండేందుకు నీళ్లు అందుబాటులో ఉండడం లేదు. ఆన్‌లైన్‌లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. నీళ్లులేక రెండు రోజులకోసారి స్నానం చేస్తున్నారు. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లలో వాన నీటిని ఒడిసి పట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నా...అదీ సక్సెస్ కాలేదు. ఫలితంగా అన్ని చోట్లా వాటర్ ట్యాంకర్‌లపైనే ఆధారపడుతున్నారు. స్టీల్ పళ్లాలు, గిన్నెల్లో తింటే వాటిని కడిగేందుకు నీళ్లు ఉండడం లేదని డిస్పోజబుల్ కప్పులు, గ్లాస్‌లు, ప్లేట్‌లు వాడుతున్నారు. అటు విద్యాసంస్థల్లోనూ ఇదే దుస్థితి. కొన్ని కోచింగ్ సెంటర్లు అయితే...వారం రోజుల పాటు విద్యార్థులెవరూ రావద్దని చెప్పింది. ఆన్‌లైన్‌లో క్లాస్‌లకు అటెండ్ అవ్వాలని తెలిపింది. ఓ చోట ఏకంగా స్కూల్‌నే మూసేశారు. విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా నీళ్లు అందించలేకపోతున్నామని, కొద్ది రోజుల పాటు ఆన్‌లైన్‌లోనే క్లాస్‌లు నిర్వహిస్తామని ఆ యాజామాన్యం చెప్పింది. కొవిడ్ లాక్‌డౌన్‌ నాటి రోజులు గుర్తుస్తున్నాయంటున్నారు విద్యార్థులు. ఇక నీళ్లని కాపాడుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రయత్నిస్తున్నారు. అసలే వేసవి కాలం. సాధారణంగా అయితే రెండు పూటల స్నానం చేస్తారు. కానీ...నీళ్లు లేక ఒక్కపూట కూడా మానుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇలా చేస్తున్నామంటున్నారు బెంగళూరు వాసులు. 


"మాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్క నీటి చుక్కని కాపాడుకుంటున్నాం. వంట వండితే ఆ పాత్రల్ని కడగడానికి నీళ్లు కావాలి. అందుకు నీళ్లెక్కడివి. అందుకే డిస్పోజబుల్‌ ప్లేట్‌లు, కప్పులు, గ్లాస్‌లు వాడుతున్నాం. వారానికి రెండు సార్లు బయట నుంచే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం. వారానికి ఓసారి మాత్రమే వాషింగ్ మెషీన్ వాడుతున్నాం"


- స్థానికులు


కొంతమందైతే ఇంట్లో స్నానం చేయడం కుదరడం లేదని దగ్గర్లోని మాల్స్‌కి వెళ్తున్నారు. ఆ మాల్స్‌లోని టాయిలెట్స్‌లోనే స్నానాలు చేస్తున్నారు. ఇక మరి కొందరు ఉద్యోగులు బెంగళూరులో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. సొంతూరికి వెళ్లిపోయి అక్కడే కొద్ది రోజులు పని చేస్తామని చెబుతున్నారు. వర్షాకాలం వచ్చేంత వరకూ ఈ ఇబ్బందులు తప్పేలా లేవని, అప్పటి వరకూ వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి బెంగళూరుకి రెండే రెండు మార్గాల్లో నీళ్లు సరఫరా అవుతున్నాయి. అయితే భూగర్భజలాలపైన ఆధారపడాలి. లేదంటే కావేరీ నదీ నీళ్లు. కానీ...ఈసారి వర్షపాతం సరిగ్గా నమోదు కాకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కావేరీ నదీ జలాల విషయంలోనూ తమిళనాడు ప్రభుత్వంతో వివాదం తలెత్తింది. ప్రస్తుత కొరత తీరాలంటే బెంగళూరుకి రోజుకి 2,600 - 2,800 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి. బెంగళూరు శివారు ప్రాంతాల్లోనూ ఇదే సంక్షోభం కనిపిస్తోంది. దాదాపు 110 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది. 2007 తరవాత ఈ స్థాయిలో నీటి కొరత ఎదురైంది ఇప్పుడే. 


Also Read: Electoral Bonds Case: పొలిటికల్ హీట్ పెంచిన ఎలక్టోరల్ బాండ్స్ కేసు, బీజేపీపై కాంగ్రెస్ ఫైర్