Russia Presidential Elections 2024: రష్యా అధ్యక్ష ఎన్నికలు మొదలయ్యాయి. మార్చి 15-17 వరకూ ఈ పోలింగ్ కొనసాగనుంది. అయితే..ఇక్కడ భారత్‌లోనూ ఈ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. కేరళలోనూ పోలింగ్ జరుగుతోంది. తిరువనంతపురంలో ఉంటున్న రష్యన్ పౌరుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని రష్యన్ హౌజ్ వద్ద ఈ బూత్‌ని ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇలా రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగడం మూడోసారి అని అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ ప్రక్రియకి రష్యన్ పౌరులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఉండే రష్యన్ పౌరులతో పాటు భారత్‌లో పర్యటించేందుకు వచ్చిన రష్యా పర్యాటకులూ ఈ పోలింగ్‌లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రతిసారీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. 


"కేరళలో ఇలా రష్యా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం ఇది మూడోసారి. ఇక్కడ ఉండే రష్యన్ పౌరులతో పాటు ఇక్కడ పర్యటించేందుకు వచ్చిన వాళ్లకీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించాలనే ఇలా ప్రతిసారీ పోలింగ్ చేపడుతున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం, రష్యన్ ఫెడరేషన్ సహకారంతో ఇది విజయవంతంగా జరుగుతోంది. కేరళలోని రష్యా పౌరులు పోలింగ్ ప్రక్రియకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు"


- రతీష్ నాయర్, రష్యన్ హౌజ్ డైరెక్టర్ 


ఈ పోలింగ్ ఏర్పాట్లపై రష్యన్ పౌరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. 


"ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చిన వాళ్లలో చాలా మంది ఇక్కడే ఉంటున్నారు. మరికొందరు కేరళని చూసేందుకు వచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోకుండా ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఇది ప్రతిపౌరుని బాధ్యత. రష్యన్ హౌజ్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు"


- రష్యన్ పౌరుడు 


ఇప్పటికే రష్యాలో పోలింగ్ మొదలైంది. రష్యాలోని 11 జోన్స్‌లో మార్చి 17 వరకూ ఇది కొనసాగనుంది. అధ్యక్షుడు పుతిన్‌తో తలపడేందుకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేవలం ముగ్గురికే అవకాశమిచ్చింది. ప్రతిపక్ష నేతల్లో చాలా మంది జైళ్లలో ఉన్నారు. ఇంకొందరు చనిపోయారు. మరికొందరిని బహిష్కరించారు. ఫలితంగా...పుతిన్‌ విజయం పక్కా అని తేల్చి చెబుతున్నారు అక్కడి రాజకీయ నిపుణులు. ఈసారి కూడా పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే 2030 వరకూ ఆయనే ఆ పదవిలో కొనసాగుతారు. అంతే కాదు. 2036 వరకూ అధ్యక్ష పదవిలో తానే ఉండేలా రాజ్యాంగంలో కొన్ని సవరణలు కూడా చేశారు.