Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో మరోసారి సుప్రీంకోర్టు SBIపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బాండ్‌ల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించలేదని మండి పడింది. గడువులోగా వివరాలు ఇవ్వలేదని ఇప్పటికే ఓ సారి SBIపై ఫైర్ అయింది సుప్రీంకోర్టు. ఆ వెంటనే SBI అప్రమత్తమై ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించింది. అయితే...ఇప్పుడీ వివరాలపై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ని విచారించిన సమయంలో ధర్మాసనం SBI ఇచ్చిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎలక్టోరల్ బాండ్స్‌ సంఖ్యని కూడా వెల్లడించాలని తేల్చి చెప్పింది. 


"SBI తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు..? ఇప్పటి వరకూ ఎలక్టోరల్ బాండ్స్ సంఖ్య ఎంతో వెల్లడించలేదు. SBI కచ్చితంగా ఈ వివరాలను సమర్పించాల్సిందే"


- సుప్రీంకోర్టు 






SBIకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు..


ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు SBIకి నోటీసులు జారీ చేసింది. వివరాలు అసంపూర్తిగా ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మార్చి 18వ తేదీన మరోసారి దీనిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఎవరెవరు విరాళాలు ఇచ్చారు..? ఏయే పార్టీలకు ఇచ్చారు..? అనే వివరాలు తెలియాలంటే కచ్చితంగా ఎన్ని ఎలక్టోరల్‌ బాండ్స్ విక్రయించారో చెప్పాలని కోర్టు స్పష్టం చేస్తోంది. జూన్ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని, ఆలోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని SBI సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసింది. అయితే...మార్చి 11వ తేదీన ఈ పిటిషన్‌ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ తీర్పులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘం మరో  పిటిషన్ వేసింది. ఇప్పుడీ పిటిషన్‌ని విచారిస్తూనే SBIపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ కోర్టులో సమర్పించిన బాండ్స్ వివరాలను వెనక్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే...ఈ వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సుప్రీంకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ని ఆదేశించింది. అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్‌ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వివరించారు. ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌ని చేర్చకుండానే SBI వివరాలు ఇచ్చిందని కోర్టు అసహనం వ్యక్తం చేసినట్టు వెల్లడించారు.