Bengaluru Water Crisis News: బెంగళూరులో నీటి కొరత రోజురోజుకీ మరింత పెరుగుతోంది. ఓ బిందెడు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్‌లతో నీళ్లు తెప్పించుకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి అవి కూడా దొరకడం లేదు. ఈ క్రమంలోనే Karnataka Water Supply and Sewerage Board కీలక నిర్ణయం తీసుకుంది. తాగు నీటిని కార్ వాషింగ్‌ కోసం, గార్డెనింగ్‌ కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిచింది. రూ.5 వేల జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. దాదాపు అన్ని చోట్లా బోర్‌వెల్స్ ఎండిపోయాయి. ఈ సారి వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల నీళ్లకు బెంగళూరు వాసులు అల్లాడిపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్‌లు భారీగా దండుకుంటున్నాయి. మామూలు రోజుల్లో కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చిన ధరలకు నీళ్లని విక్రయిస్తే ఊరుకోం అని స్పష్టం చేసింది. 200 ప్రైవేట్ ట్యాంకర్స్‌కి కీలక ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నీటిని సరఫరా చేయాలని వెల్లడించింది. మరో నాలుగు నెలల పాటు ఇవే ధరలు కొనసాగాలని తేల్చి చెప్పింది. 5 కిలోమీటర్ల లోపు నీటని సరఫరా చేస్తే...6వేల లీటర్ల ట్యాంకర్‌కి రూ.600 వసూలు చేయాలని నిర్దేశించింది. ఇక 8 వేల లీటర్ల ట్యాంకర్‌కి రూ.700,12 వేల లీటర్ల ట్యాంకర్‌కి రూ.1000 వరకూ వసూలు చేసుకోవచ్చని తెలిపింది. 5 కిలోమీటర్లు దాటితే..6 వేల లీటర్ల ట్యాంకర్‌కి రూ.750 ధర నిర్ణయించారు. 


ప్రస్తుతానికి బెంగళూరులో దాదాపు 60% మందికిపైగా వాటర్ ట్యాంకర్‌లపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ధరల్ని నిర్ణయించినప్పటికీ కొన్ని చోట్ల ప్రైవేట్ ట్యాంకర్‌లు అందుకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్రంలోని 136 తాలూకాల్లో 123 చోట్ల నీటి కొరత ఉందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారికంగా వెల్లడించారు. వీటిలో 109 తాలూకాల్లో సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అటు బీజేపీ మాత్రం సిద్దరామయ్య సర్కార్‌పై తీవ్రంగా మండి పడుతోంది. నిపుణులు ముందే హెచ్చరించినా నీటి కొరతపై ప్రభుత్వం దృష్టి సారించలేదని ఆరోపిస్తోంది. ఈ సమస్యపై కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు ప్రజలకి త్వరలోనే సరిపడా నీళ్లని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. చాలా చోట్ల బోర్లు ఎండిపోయాయని, తన ఇంట్లోనూ ఇదే పరిస్థితి ఉందని వివరించారు. ప్రస్తుతం నీటికి చాలా కొరత ఉన్న మాట నిజమే అని...కానీ ఈ సమస్యని తప్పకుండా పరిష్కరిస్తామని వెల్లడించారు.


"కొన్ని ప్రైవేట్ ట్యాంకర్‌లు రూ.600కే ఫుల్ ట్యాంక్‌ని సప్లై చేస్తున్నాయి. మరి కొన్ని రూ.3 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఈ స్థాయిలో తేడా లేకుండా వాళ్లతో మాట్లాడుతున్నాం. రిజిస్టర్ అయిన వాళ్లే సరఫరా చేసేలా చూస్తున్నాం. ఎంత దూరం వెళ్లి సరఫరా చేస్తున్నాయన్నదానిపైనే డబ్బుల్ని వసూలు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


Also Read: ముఖంపై 15 సార్లు కత్తితో పొడిచి జిమ్ ట్రైనర్ దారుణ హత్య - తండ్రే హంతకుడా?