YSRCP Government: వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిపై తాను చర్చకు సిద్దమని ప్రతిపక్షాలకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సవాల్ చేశారు. జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని, ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్‌కు అనుకూలంగా ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఇప్పటికే విడుదల అవ్వగా.. శపథం సినిమా ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్బంగా విజయవాడలో ఈ సినిమాలకు సంబంధించి ఈర్జీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కించానని, జగన్ అంటే ఏమిటో వీటి ద్వారా తెలుస్తుందని అన్నారు. జగన్ గురించి తాను నమ్మిన నిజాలను ఈ సినిమాలో చూపించానని, కేవలం ఆయన గురించి తన అభిప్రాయాల ఆధారంగా సినిమా తెరకెక్కించిన్లు ఆర్జీవీ స్పష్టం చేశారు.
వైఎస్ వివేకా హత్యను కూడా ప్రస్తావించా
ఈ సినిమాలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావించినట్లు రాంగోపాల్ వర్మ తెలిపారు. ఈ సినిమాలో ఎన్నో అంశాలు ఉంటాయన్నారు. జగన్ సీఎం కాకుండా చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ పన్నిన కుట్రలను చూపించానని, వాటిని ఎదుర్కొని జగన్ ఎలా ఎదిగారనేది సినిమాలో ఉంటుందని తెలిపారు. శపథం సినిమాను 8న థియేటర్లలో విడుదల చేయాల్సి ఉందని, కానీ ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయడం లేదని వెల్లడించారు. శపథం ఆరంభం, శపథం అంతం పేరుతో ఓటీటీలో వెబ్‌సిరీస్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. శపథం ఛాప్టర్ 1ను మార్చి 7 సాయంత్రం ఎనిమిది గంటలకు, శపథం అంతంను మార్చి 8న సాయంత్రం 8 గంటలకు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా పే పర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఆ తర్వాత త్వరలో మిగతా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లలో కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. అన్ని నిజాలను శపథంలో చూపిస్తామన్నారు.
సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్
వ్యూహం, శపథం సినిమాల అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ తీయడం అని, కానీ సెన్సార్ బోర్డు నుంచి అనుమతులు రాలేదన్నారు. దీంతో సెన్సార్ బోర్డు నుంచి అనుమతించిన వచ్చిన వెర్షన్‌ను మాత్రమే థియేటర్లలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. మిగతా వెర్షన్లను ఓటీటీలో రిలీజ్ చేస్తామన్నారు. ఫిబ్రవరి 23న వ్యూహం, మార్చి 1న శపథం సినిమా రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు, హైకోర్టు నుంచి అడ్డంకులు రావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి సెన్సార్ బోర్డు, హైకోర్టు నుంచి అనుమతి రాకవడంతో సినిమాలను విడుదల చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల వేళ ఈ సినిమాలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నారా లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. వీరి కామెంట్లకు ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.