Bengaluru Blast Case: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముందు ఇది సిలిండర్ పేలుడు అని భావించినా ఆ తరవాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్‌లో ఓ అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. అందులోనే పేలుడు పదార్థాలు పెట్టినట్టు అనుమానించారు. ఆ తరవాత ఫోరెన్సిక్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. IED పేలుడు సంభవించినట్టు స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు.




ఇప్పుడీ కేసులో కీలక సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయి. CC కెమెరా ఫుటేజ్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌తో కేఫ్‌లోకి వచ్చినట్టు రికార్డ్ అయింది. అతనిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...ఈ వ్యక్తే కేఫ్‌లోకి వెళ్లి అక్కడ బ్యాగ్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరవాత కాసేపటికే పేలుడు సంభవించింది. సీసీ ఫుటేజ్‌లో అనుమానితుడు మాస్క్, కళ్లజోడు పెట్టుకుని ఉన్నాడు. ఈ అనుమానితుడితో పాటు ఉన్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 1వ తేదీన మధ్యాహ్నం 12.50, ఒంటిగంట మధ్య కాలంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు పది మంది గాయపడ్డారు. NIA రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టింది. ఈ పేలుడులో గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను అనవసరంగా రాజకీయం చేయొద్దని సిద్దరామయ్య ఇప్పటికే వెల్లడించారు. విచారణకు అందరూ సహకరించాలని కోరారు. 






కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడు ఎలా జరిగిందో వివరించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్టు వెల్లడించారు. 


"మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఓ 30 ఏళ్ల వ్యక్తి కేఫ్‌కి వచ్చాడు. రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. కేఫ్‌కి పక్కనే ఓ చెట్టు దగ్గర బ్యాగ్ పెట్టాడు. టిఫిన్ తిని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్యాగ్ మాత్రం అక్కడే ఉండిపోయింది. అతడు వెళ్లిపోయిన గంట తరవాత పేలుడు చోటు చేసుకుంది"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం