Krishna Mukunda Murari Today Episode ముకుంద మురారి ఫోన్‌కు వెంటనే గార్డెన్‌కురా నీతో మాట్లాడాలి అని మెసేజ్ చేస్తుంది. అది కృష్ణ చూసేస్తుంది. ఇంతలో మురారి వస్తే ఆ విషయం చెప్తుంది. దాంతో మురారి షాక్ అయిపోతాడు. ఇక కృష్ణ నేను ముందే చెప్పాను కదా మీతో పర్శనల్‌గా మాట్లాడాలి అనుకుంటుంది అని వెళ్లి రండి..
మురారి: ఏంటి వెళ్లేది.. ఆ చెత్త అంతా వినే ఓపిక నాకు లేదు. సమాధానం చెప్పే సహనం కూడా నాకు లేదు.
కృష్ణ: అలా అంటే ఎలా ఏసీపీ సార్ మాట్లాడకపోతే తను ఏం అనుకుంటుందో.. ఏం చేయాలి అనుకుంటుందో మనకు ఎలా తెలుస్తుంది.
మురారి: ఏమైనా చేసుకోని తనకి ఎదురు పడాలి అన్నా.. తనతో మాట్లాడాలి అన్నా చిరాకుగా ఉంది. తను ఇలాగే పిచ్చి వాగుడు వాగితే ఆ కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. అందుకే వెళ్లకపోవడమే మంచిది.
కృష్ణ: అలా కాదు గానీ వేరే ఏదైనా మ్యాటర్ చెప్పండి.. వెళ్లడానికి భయపడుతున్నారు. మీరు ఇప్పుడు ముకుంద దగ్గరకు వెళ్తే తనేం మాట్లాడుతుందో మీరే నిర్ణయం తీసుకుంటారో అది తెలిసి నేను ఎక్కడ టెన్షన్ పడతానో అని మీరు భయపడుతున్నారు కదూ.. అంతే కదా.. అలాంటి భయం ఏం అక్కర్లేదు. మీరు ఎప్పుడూ నా వాడివే. ఎంతమంది వచ్చినా నా ఏసీపీ సార్‌ని నన్ను దూరం చేయలేరు.
మురారి: అసలు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి కృష్ణ.. ముకుంద మారుతుందా.. దీనికి పరిష్కారం ఏంటి.. అన్నీ ఆలోచిస్తుంటే ఏం చేయాలా అని భయం వేస్తుంది.
కృష్ణ: ముందు ఒక ప్లాన్ వేసుకున్నాం కదా.. మీరు వెళ్లండి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ నాకు తన గురించి తెలుసు అని చెప్పకండి..
మురారి: సరే..
ముకుంద: మురారి ఆటలుగా ఉందా.. ఆదర్శ్‌ని ఇంటి నుంచి పంపించి మా శోభనం ఆపమంటే మీ శోభనానికి ముహూర్తం పెట్టించుకొని వస్తావా..
మురారి: అవును. నేనే ముహూర్తం పెట్టించా తప్పేముంది.
ముకుంద: ఇప్పటికే కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా ఇంకా కోపం తెప్పించకు మురారి. ఎప్పటికైనా శోభనం అంటూ జరిగితే అది నీకు నాకు మాత్రమే జరగాలి. మనకు వేరే వాళ్లతో కాదు.
మురారి: ముకుందా.. నువ్వు కాదు నేను కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా అర్థం పర్థం లేకుండా మాట్లాడి కోపం తెప్పించకు.
ముకుంద: నన్ను ప్రేమించిన వాడివి నన్ను అర్థం చేసుకున్న వాడివి కదా అని నా బాధని నీతో పంచుకుంటే అది తీర్చాల్సింది పోయి నీకు నచ్చినట్లు చేస్తుంటే ఏమనుకోవాలి. అసలు నా బాధ ఏంటో నీకు కొంచెం అయినా అర్థమవుతుందా.
మురారి: నీది బాధ కాదు.. పిచ్చి వెర్రి తనం..
ముకుంద: చూడు మురారి నా మాట విని ఆదర్శ్‌ని పంపించేయ్.. మనం ఒకటయ్యే మార్గం చూడు..
మురారి: మారవా నువ్వు ఎంత చెప్పినా మారవా.. ఆదర్శ్‌ని ఎక్కడికి పంపించమంటావ్ ఇది తన ఇళ్లు.. ఏం తప్పు చేశాడని తను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. నిన్ను ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడమే తను చేసిన నేరమా..
ముకుంద: మరి నేను నిన్ను ప్రేమించడం.. నీతో కలిసి బతకాలి అనుకోవడం నేరమా..
మురారి: మనం కలిసి బతకాలి అనుకున్నాం. చాలా దూరం వెళ్లిపోయాం.. నువ్వు కూడా నీ మూడు ముళ్లు బంధానికి విలువ ఇచ్చి చూడు చాలా బాగుంటుంది నీ జీవితం.
ముకుంద: చాలు ఆఖరి సారి అడుగుతున్నాను శోభనం ఆగుతుందా లేదా..
మురారి: ఆగదు.. నువ్వు కూడా నీ మనసు మార్చుకో..
ముకుంద: సరే నేనేం చేయాలో నాకు తెలుసు.
మురారి: చూడు నేను చెప్పినట్లు నీ మనసు మార్చుకో నీకు నాకు ఈ ఇంటికి మంచిది.
రెండు జంటల్ని తీసుకొని రేవతి గుడికి వస్తుంది. రెండు జంటలతో శోభనానికి ముందు పూజలు జరిపించడం తమ ఆచారం అని భార్యాభర్తలు ఒకరి అడుగులో ఒకరు అడుగులు వేయాలి అని అంటుంది. ముకుంద మాత్రం తిట్టుకొని తాను మురారితోనే అడుగులు వేస్తాను అంటుంది. ఇక అందరూ గుడి లోపలికి వెళ్తే కాలు సరిగా కడుక్కోలేదు అని ముకుంద ఉండిపోతుంది. తర్వాత వచ్చి మురారి అడుగుల మీద అడుగులు వేస్తుంది. దాన్ని మధు చూస్తాడు. తర్వాత కృష్ణని తీసుకొచ్చి చూపిస్తాడు. కృష్ణ నమ్మదు. మరోవైపు దేవుడి దర్శనం తర్వాత పంతులు ఇద్దరి జంటల పేరిట పూజ చేశానని ప్రత్యేక పూజలు అవసరం లేదు అని అంటారు. దీంతో ముకుంద ఆదర్శ్ పక్కన కూర్చొనే పని తప్పిందని సంతోషపడుతుంది. అయితే పంతులు భార్య భర్తలను కలిపే క్రతువు ఒకటి ఉందని.. భార్యభర్తలు ఎదురెదురుగా నిల్చొని భార్య భర్త పాదాలమీద నిల్చొని మూడు ప్రదక్షిణలు చేయాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.