Director Krish Attended Investigation in Drugs Case: హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసుల నోటీసులకు స్పందించిన డైరెక్టర్ క్రిష్ (Director Krish) విచారణకు హాజరయ్యారు. అనూహ్యంగా ఆయన పోలీసుల ముందుకు రాగా, అత్యంత రహస్యంగా విచారణ చేపట్టారు. దాదాపు 4 గంటల పాటు ఆయన్ను విచారించిన పోలీసులు శాంపిల్స్ తీసుకుని పంపించేశారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఒకవేళ, టెస్టులో పాజిటివ్ గా తేలితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్ టెస్టులో నెగిటివ్ వస్తే విట్ నెస్ కింద మరోసారి క్రిష్ ను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇప్పటికే ఈ కేసులో వివేకానంద, స్నేహితులు నిర్భయ్, కేదార్, డ్రగ్స్ సరఫరాదారుడు అబ్బాస్, మీర్జా వాహిద్ బేగ్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో హోటల్ లో పోలీసులు దాడి చేయగా.. డ్రగ్స్ పార్టీ బాగోతం వెలుగుచూసింది. అనంతరం విచారణ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ పేరు బయటకు వచ్చింది. ఆయన పేరును ఎఫ్ఐఆర్ చేర్చిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందికి ప్రమేయముందని ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. లిషి, శ్వేత, నీల్, సందీప్ ఇంకా పోలీసుల ముందుకు రాలేదు. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించి వారిని వైద్య పరీక్షలకు పంపే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
క్రిష్ బెయిల్ పిటిషన్ పై..
మరోవైపు, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న దర్శకుడు క్రిష్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. జస్టిస్ జి.రాధారాణి దీనిపై విచారణ చేపట్టగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో మొదటి నిందితుడైన వివేకానంద ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ ను పదో నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తునకు అవసరమైనప్పుడు పిటిషనర్ హాజరవుతారని, కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేశారు.
Also Read: Greater City Corporation: గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు