Bengaluru Metro Station: 


ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు..


బెంగళూరులో గత వారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు మెట్రో సెకండ్ ఫేజ్ 13.71 కిలోమీటర్ల ప్రాజెక్టుని ప్రారంభించారు. వైట్‌ ఫీల్డ్ నుంచి కృష్ణరాజపురం లైన్ అందుబాటులోకి వచ్చింది. అయితే...ఈ లైన్‌లోని నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌ పేరు ఇప్పుడు మారు మోగుతోంది. ప్రారంభించి వారం అయిందో కాలేదో అప్పుడే ఈ స్టేషన్‌ జలమయమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేషన్‌లో నీళ్లు నిలిచిపోయాయి. రూ.4,249 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని నిర్మించారు. వారం రోజుల్లోనే ఇలా జలమయం అవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నాయి. నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు నిలిచిపోయాయంటూ కొందరు నెటిజన్లు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. పనులు సరిగా పూర్తి కాకముందే హడావుడిగా ఎందుకు ప్రారంభించారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. "ఇంత తక్కువ వర్షం పడితేనే ఇలా ఉంటే...వానాకాలంలో పరిస్థితేంటి..?" అంటూ మరి కొందరు మండి పడుతున్నారు. పనులు పూర్తి కాకుండా ఓపెన్ చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయంటూ విమర్శిస్తున్నారు.