హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. రెగ్యులర్ మెయింటెనెన్స్‌లో భాగంగా వంతెనను పూర్తి స్థాయిలో పరీక్షించాల్సి ఉన్నందున మూసివేస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యాన్యువల్ ప్రకారం.. నిర్ణీత కాల వ్యవధిలో ఇంజినీర్లతో కేబుల్ వంతెనను తనిఖీ చేయించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ తనిఖీల కోసం భారీ బరువు ఉన్న క్రేన్లను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి వస్తుందని, ఆ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చెప్పారు. అందుకే మూడు రోజుల పాటు కేబుల్ బ్రిడ్జిని మూసివేస్తామని ప్రకటించారు. ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.
ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదచారులు, సందర్శకులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లిస్తున్నామని అన్నారు.
అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
ఐకానిక్ కట్టడంగా హైదరాబాద్‌లో దుర్గం చెరువు వంతెన
దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45ను మాదాపూర్‌తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. రెండు పిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. ఐటీ ఉద్యోగులకే కాకుండా నగర ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యంగా ఉండేలా దూరాన్ని, ట్రాఫిక్‌ను తగ్గించేందుకు దుర్గం చెరువుపై ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఇది 2020లో ప్రారంభం అయింది. దుర్గం చెరువు ప్రాంతం పర్యటక పరంగానూ ఎంతో అభివృద్ధి చెందింది. మొత్తం రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఇందుకు మొత్తం రెండేళ్ళ సమయం పట్టింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీకి అప్పగించారు. కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైంది. ఒక్కో పైలాన్‌కు 26 ద్రుఢమైన ఐరన్ కేబుళ్లను వాడారు. జర్మన్ టెక్నాలజీతో 8 దేశాల ఇంజినీర్లు 22 నెలలపాటు శ్రమించి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.