Rahul Gandhi Gets Bail: పరువు నష్టం దావా కేసులో బెంగళూరు కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్. ప్రతి పనిలో ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటోందని ఆరోపించారు. దీనిపై కర్ణాటక బీజేపీ కోర్టుని ఆశ్రయించింది. రాహుల్‌పై పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారించిన కోర్టు రాహుల్‌కి బెయిల్ మంజూరు చేసింది. 






కేసు వివరాలివే..


అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. కమీషన్ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసింది. కేవలం నోటి మాటలానే కాదు. ఏకంగా న్యూస్‌ పేపర్లలో యాడ్స్ వేయించింది. 2019-23 మధ్య కాలంలో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. దీనిపై బీజేపీ తీవ్రంగా మండి పడింది. గతేడాది జూన్‌లోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా కేసు వేసింది. ఆ సమయంలో వార్తాపత్రికల్లోని అన్ని ప్రకటనల గురించి ప్రస్తావించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యాడ్స్‌ ఇచ్చింది.



శివకుమార్, సిద్దరామయ్య ఈ యాడ్స్ వేయించగా రాహుల్ గాంధీ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే కేసులో సిద్దరామయ్య,డీకే శివకుమార్‌పైనా పరువు నష్టం దావాలు వేయగా వాళ్లిద్దరికీ జూన్ 1న బెయిల్ మంజూరైంది. రాహుల్‌పైనా దావాని పరిగణనలోకి తీసుకున్న కోర్టు జూన్ 7వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాహుల్ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బెంగళూరుకి బయల్దేరారు. కోర్టులో హాజరయ్యారు. విచారించిన కోర్టు రాహుల్‌కి బెయిల్ మంజూరు చేసింది.