Bengaluru Cafe Blast Case: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారిని NIA బెంగాల్‌లో అరెస్ట్ చేసింది. ఈ పేలుడు తరవాత పరారీలో ఉన్న నిందితుడు కోల్‌కత్తాలో తలదాచుకున్నట్టు గుర్తించారు. అరెస్ట్ అయిన ముసావిర్ హుస్సేన్ కేఫ్‌లో బాంబు పెట్టినట్టు NIA స్పష్టం చేసింది. 






ముసావిర్‌ కేఫ్‌లో IED పెట్టాడని, అయితే...ఈ మొత్తం దాడికి ప్లాన్ చేసింది మాత్రం అబ్దుల్ మతీన్ తహా అని వెల్లడించింది. ఈ ఇద్దరూ ఇప్పటికే 2000 సంవత్సరంలో ఉగ్రవాదం కేసులో వాంటెడ్‌గా ఉన్నారు. బెంగళూరులోని ఐసిస్ మాడ్యూల్‌తో అబ్దుల్ మతీన్‌కి లింక్స్ ఉన్నాయని NIA గుర్తించింది. నకిలీ గుర్తింపు కార్డులతో ఓ చోట తలదాచుకుంటున్నాడని వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు వెస్ట్‌బెంగాల్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. మార్చి 29వ తేదీన NIA ఈ నిందితుడి వివరాలు, ఫొటోలు విడుదల చేసింది. ఆ నిందితుడికి సంబంధించి ఎలాంటి సమాచారం అందించినా వాళ్లకి రూ.10 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇక ప్రధాన నిందితుడు ముసావిర్ హుస్సేన్...తన పేరు మార్చుకుని నకిలీ ఐడీలతో తిరుగుతున్నాడని తెలిపింది. అంతే కాదు. తనను తాను హిందువుగా చెప్పుకుంటున్నాడని వివరించింది. ఆధార్‌ కార్డ్‌ని ఫోర్జరీ చేసినట్టు గుర్తించింది.