Lok Sabha Election 2024:


పొత్తు ప్రసక్తే లేదు...


మరో ఏడాదిలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలూ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదంటూ తేల్చి చెప్పారు. తమ పొత్తు కేవలం ప్రజలతోనే అని వెల్లడించారు. ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మమత...పొత్తుల విషయంలో తాము ఎవరి మాట వినదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. సాగరదిగి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. తృణమూల్‌ను ఓడించి విజయం సాధించాయి. దీనిపై స్పందించిన మమతా...వామపక్షాలు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనైతికం అని మండి పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం తమలో తాము ఓట్లు పంచుకుంటున్నాయని విమర్శించారు. 


"కాంగ్రెస్, సీపీఎం చెప్పే మాటలు వినాల్సిన పని లేదు. వాళ్లు బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నారని అర్థమవుతోంది. వాళ్లు కుమ్మక్కై ఓట్లు పంచుకుంటున్నారు. అలాంటి వాళ్లతో చేతులు కలపాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు. కానీ నైతికంగా ఓడిపోయారు"


-మమతా బెనర్జీ,పశ్చిమ బెంగాల్ సీఎం


అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రతిపక్షాలను ఏకం చేయడంపై మాట్లాడారు. ప్రతిపక్షాలను లీడ్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు లేదని, కేవలం అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశం అని తేల్చి చెప్పారు. ప్రధాని అభ్యర్థి పేరునీ ప్రకటించడం లేదని, సిద్ధాంతాల పరంగా ఒకే రకమైన ఆలోచన ఉన్నపార్టీలన్నీ కలిసొస్తే బీజేపీని ఢీకొట్టొచ్చు అని వివరించారు. 


థాక్రే ఏమన్నారంటే..?


శివసేన పార్టీ పేరు, గుర్తుని కోల్పోయిన థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఎన్నికల సంఘం శిందే వర్గానికి వాటిని కేటాయించడంపై మండి పడుతోంది. ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన సామ్‌నా పత్రికలో ఎడిటోరియల్ రాసిన థాక్రే...వేరువేరుగా బీజేపీపై పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వాన్నీ ప్రస్తావించారు. 


"మనం బీజేపీపై పోరాటం చేయాలంటే ఇలా వేరువేరుగా ఉంటే అది కుదరదు. మనమంతా కలిసి మెరుపు దాడి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మాత్రమే ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేదు. ప్రతిపక్షాలు ఐక్యం కావడమే చాలా కీలకం" 


- సామ్నా పత్రికలో ఉద్దవ్ థాక్రే 


2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్నీ ఈ సంపాదకీయంలో చర్చించారు థాక్రే. అప్పటి సంగతి అప్పుడే చూసుకుందామని స్పష్టం చేశారు. ఇది తరవాత నిర్ణయించుకుందామంటూ ప్రతిపక్షాలకు సూచించారు. 


Also Read: Bird Flu In China: మనిషికి బర్డ్‌ ఫ్లూ సోకిందట, చైనాలో తొలి కేసు నమోదు