Bird Flu In China:


మహిళకు బర్డ్‌ ఫ్లూ..


చైనా పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది వింత వింత రోగాలే. ఎన్నో వైరస్‌లు అక్కడి నుంచే పుట్టాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కరోనా కూడా చైనా ల్యాబ్‌ నుంచే విస్తరించిందన్న వాదన ఉంది. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు ఇలాంటి కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందేందుకు ఆస్కారమిస్తుంటాయి. ఇప్పుడు అదే తరహాలో అక్కడ బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. అయితే బర్డ్ ఫ్లూ అంటే కేవలం కోళ్లకే వస్తుందనుకుంటాం. కానీ చైనాలో తొలిసారి ఓ మనిషికి H5N1 Bird Flu సోకింది. ఇదే విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది. తూర్పు చైనాలోని ఓ మహిళకు ఈ ఫ్లూ సోకినట్టు ప్రకటించింది. ఆ మహిళ ఓ పౌల్ట్రీకి వెళ్లిందని అప్పటి నుంచి తాను అస్వస్థకు గురైందని వివరించింది. జనవరి 31న ఫ్లూ లక్షణాలు కనిపించిన కారణంగా టెస్ట్ చేశారు. చివరకు ఫ్లూ సోకినట్టు నిర్ధరణైంది. అంతకు ముందు కంబోడియాలోనూ 11 ఏళ్ల బాలికకు ఈ ఫ్లూ సోకి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే ఆ దేశంలో రెండు కేసులు నమోదయ్యాయి. 49 ఏళ్ల మహిళకూ  H5N1 Bird Flu సోకినట్టు కంబోడియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 9 ఏళ్లుగా ఈ వైరస్‌ అప్పుడప్పుడూ ఆందోళనకు గురి చేస్తున్నా మనుషులకు సోకింది లేదు. కానీ ఈసారి మాత్రం వైరస్ తీవ్రత పెరిగినట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకే మనుషులకూ సోకుతోంది. చిన్న పిల్లలకు ఇది తొందరగా వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పౌల్ట్రీలకు వారిని దూరంగా ఉంచాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. 




తగ్గిన జనాభా..


ప్రపంచంలో అత్యధిక జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే...చైనా అని అందరం ఠక్కున సమాధానం చెప్పేస్తాం. ఆ తరవాత భారత్‌లోనూ అదే స్థాయిలో జనాభా ఉంది. పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా...ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే...
సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా...భారత్‌ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా...ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే..చైనాను దాటేసి మరీ భారత్‌ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది.