TikTok Ban: 


టిక్‌టాక్‌పై బ్యాన్ 


చైనా యాప్స్‌పై పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి. భారత్ సహా అమెరికా కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. యాప్స్‌ పేరుతో చైనా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే BBC News ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులందరూ తమ ఫోన్‌లలోని టిక్‌టాక్ యాప్‌ని (TikTok Ban) తొలగించాలని వెల్లడించింది. బిజినెస్ పర్పస్‌లో వినియోగించాల్సి వస్తే తప్ప ఎవరూ ఆ యాప్‌ను వాడొద్దని తేల్చి చెప్పింది. కీలకమైన డేటాను చోరీ చేసే ప్రమాదముందని హెచ్చరించింది. ఉద్యోగులందరికీ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. 


"BBC కార్పొరేట్ డివైజ్‌లలో టిక్‌టాక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయొద్దు. బిజినెస్ పరమైన కారణాలుంటే తప్ప ఈ యాప్‌ను వాడొద్దు. సరైన కారణం లేకుండా ఈ యాప్‌ను ఫోన్‌లో ఉంచుకోడం మంచిది కాదు. మా సిస్టమ్‌కు భద్రత కల్పించేందుకు తీసుకుంటున్న నిర్ణయమిది"


- BBC 


చైనా అధికారులు ఈ యాప్స్ ద్వారా కీలకమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న అనుమానాలున్నాయి. బ్రిటన్ కూడా ప్రభుత్వ డివైజెస్‌లో టిక్‌టాక్ యాప్ ఉండొద్దని తేల్చి చెప్పింది. అంతకు ముందు ఐరోపా దేశాలతో సహా అమెరికా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఎడిటోరియల్, మార్కెటింగ్‌ విభాగాల్లో తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తే పర్లేదని BBC తెలిపింది. అయితే...ఎప్పటికప్పుడు ఈ యాప్‌పై నిఘా పెడుతుంటామని వెల్లడించింది. 


ఈ దేశాల్లోనూ...


టిక్‌టాక్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా. చైనాలోని ByteDanceకు చెందిన టిక్‌టాక్ (TikTok)పై ఇండియాలో ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది. తాము అందించిన ఏ డివైస్‌లోనూ టిక్‌టాక్‌ యాప్ ఉండటానికి వీల్లేదని కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ యాప్‌ కారణంగా భద్రతకు భంగం వాటిల్లుతోందని ఆరోపిస్తోంది. అంతే కాదు. సెన్సిటివ్ సమాచారాన్ని సేకరిస్తున్నారన్న విమర్శలూ చేస్తోంది. ఈ వివరాలు సేకరించేందుకు చైనా ఈ యాప్‌ను అస్త్రంగా వాడుకుంటోందని మండి పడుతోంది. ఇక అగ్రరాజ్యంలోనూ టిక్‌టాక్‌పై అసహనం వ్యక్తమవుతోంది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ప్రభుత్వం జారీ చేసిన అన్ని డివైస్‌లలోనూ టిక్‌టాక్‌ను తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వ సంస్థలు వెంటనే అప్రమత్తమవ్వాలని తేల్చి చెప్పింది. 30 రోజుల్లోగా అన్ని డివైస్‌లలో టిక్‌టాక్‌ను తీసేయాలని వెల్లడించింది. అమెరికా కూడా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యూజర్స్‌కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తోందని ఆరోపిస్తోంది. పౌరుల భద్రతకు సంబంధించిన విషయం కనుక ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తేల్చి చెప్పింది అగ్రరాజ్యం. కెనడా ప్రధాని జస్టిన ట్రూడో టిక్‌టాక్ బ్యాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుల వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా చూసుకుంటామని చెప్పారు. "పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు మేం వేసిన తొలి అడుగు ఇది. ఇంతకు మించి వేరే ఆప్షన్ కూడా లేదు" అని వెల్లడించారు. 


Also Read: Viral Video: సిజేరియన్ చేస్తుండగా కంపించిన భూమి, సేఫ్‌గా డెలివరీ చేసిన వైద్యులు - వైరల్ వీడియో