Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను నిరసిస్తూ ఇటీవలే లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల పంద్రాగష్టు ప్రసంగంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం ప్రస్తావించారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రతకు భరోసా ఇస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధాని మహమ్మద్ యూనస్ ప్రధాని మోదీకి కాల్ చేశారు. హిందువులకు ఏమీ కాకుండా చూసుకుంటాని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీయే వెల్లడించారు. X వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్ ప్రధాని కాల్ చేసిన మాట్లాడినట్టు వివరించారు. అక్కడి పరిస్థితుల గురించి పూర్తిస్థాయిలో చర్చించినట్టు వెల్లడించారు. హిందువులతో పాటు అక్కడి మైనార్టీలందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. 


"బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ నాకు కాల్ చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై చర్చించాం. బంగ్లాదేశ్ సుస్థిరతకు భారత్ అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పాను. అక్కడ హిందువులతో పాటు మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు"


- ప్రధాని నరేంద్ర మోదీ






ఇప్పటికే మహమ్మద్ యూనస్ ధాకాలో ధాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి హిందువులతో మాట్లాడారు. మైనార్టీలపై దాడులు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా అక్కడి హిందూ ఇళ్లలోకి చొరబడి ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఆలయాలనూ నేలమట్టం చేశారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ కూడా ధ్వంసమైంది. భారత్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. అయితే..జమాతే ఇస్లామీ పార్టీ కార్యకర్తలే ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పార్టీ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యూనస్ హిందువులపై దాడులను ఖండించారు. వాళ్లు కూడా మన దేశ పౌరులేనని, వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని బంగ్లా పౌరులకు పిలుపునిచ్చారు.


విద్యార్థులెవరూ హిందువులపై దాడులు జరగకుండా అడ్డుకోవాలని సూచించారు. కానీ...ఆ దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవలే లక్షలాది మంది హిందువులు, మైనార్టీలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దాడులను ఖండిస్తూ నినదించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తామూ ఈ దేశ  పౌరులమేనని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లో మైనార్టీలకు  10% సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌ని వినిపించారు. మైనార్టీలకు రక్షణ కల్పించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని నినదించారు. 


Also Read: Kolkata: ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై మమతా బెనర్జీ నిరసన, హాస్పిటల్‌ వద్ద భారీ ర్యాలీ