Bangladesh Explosion: బంగ్లాదేశ్‌లోని ఓ డిపోలో భారీ పేలుడు, 37 మంది మృతి 



డిపోలో పేలుడు, పూర్తిగా కాలిపోయిన శరీరాలు


బంగ్లాదేశ్‌లోని సితకుండ ప్రాంతంలోని ఓ డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 37 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. వీరిలో దాదాపు 20 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ పేలుడుకు ముందే డిపోలో మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పేందుకు  అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలోనే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. బాధితుల్లో కొందరి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. అసలు మంటలు ఎందుకు చెలరేగాయన్న అంశంపైస్పష్టత ఇంకా రాలేదు. నాలుగు కిలోమీటర్ల వరకూ ఈ పేలుడు శబ్దం వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని భవంతుల అద్దాలు పగిలిపోయి చెల్లా చెదురైనట్టు తెలిపారు. 


పేలుడుకు కారణమేంటి..? 


చిట్టగాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది సితకుండ ప్రాంతంలోని ఆసుపత్రులన్నీ ప్రమాద బాధితులతో నిండిపోయాయి. డిపోలో పని చేసేవారితో సహా, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటికీ డిపోలో మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది వీటిని ఆర్పేందుకు ఇంకా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో డిపోలో 600 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.30 ఎకరాల్లో విస్తరించి ఉన్న  ఈ డిపోలో భారీ కంటెయినర్లు ఉంటాయి. వీటిలో కొన్ని కంటెయినర్లలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.   


బంగ్లాదేశ్‌లో తరచు ఇలాంటి ప్రమాదాలు 



బంగ్లాదేశ్‌లో ఇలాంటి పేలుళ్లు సంభవించటం సహజమే. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. గతేడాది ఓ పడవలో ఉన్నట్టుండి మంటలు చెలరేగి 39 మంది ప్రయాణికులు మృతి చెందారు. ధాకా సమీపంలోని రూప్‌గంజ్‌లో ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించగా, 52 మంది  అగ్నికి ఆహుతి అయ్యారు. అంతకు ముందు పతెంగ ప్రాంతంలోని ఓ ఆయిల్ కంటెయినర్ పేలి ముగ్గురు ప్రాణాలొదిలారు. ఇలా తరచుగా ప్రమాదాలు జరగటంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిశ్రమలు, నివాస భవనాల్లోని లోపాలను ఈ ప్రమాదాలు కళ్లకు కడుతున్నాయి. 2013లో ధాకాలో ఓ తొమ్మిదంతస్తుల భవనం కూలి 
వెయ్యి మందికిపైగా మృతి చెందారు. తరవాత 2019లో ఓ భవనంలో రసాయనాలు పేలి పదుల సంఖ్యలో పౌరుల ప్రాణాలు గాల్లో కలిశాయి. 2016లోనూ గజిపూర్‌లోని తోంగి ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగ్గా...12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలోని వాటర్ బాయిలర్‌ ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది.