CM Jagan call to Balineni Srinivas Reddy: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి t(Balineni Srinivas Reddy) సీఎం జగన్ (CM Jagan) నుంచి పిలుపు అందింది. వెంటనే ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవాలని అనడంతో బాలినేని తాడేపల్లికి వెళ్లారు. కొంతకాలంగా సీఎం జగన్ తీరు పట్ల బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసమ్మతితో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయన సొంత నియోజకవర్గం ఒంగోలులో కూడా ఉండడం లేదు. కొద్ది రోజుల క్రితం బాలినేని (Balineni Srinivas Reddy) సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినా దొరకలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు విజయవాడలోని ఓ హోటల్ లో వేచి ఉన్నా అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆయన భంగపడి హైదరాబాద్ వెళ్లిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.


బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy) ప్రకాశం జిల్లాలో (Prakasam Politics) పలు నియోజకవర్గాల ఇన్చార్జ్ ల మార్పులపై ఆగ్రహంతో ఉన్నారు. తనతో కనీసం చర్చించకుండా తన జిల్లాలో ఈ మార్పులు చేయడంతో తీవ్ర అసంతృప్తితో బాలినేని ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, దర్శి, కొండెపి అసెంబ్లీ ఇన్చార్జి ల నియామకంలో తన మాట పట్టించుకోలేదని బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ సీటు సిట్టింగ్ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలని బాలినేని ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. అంతేకాక, తన నియోజకవర్గం ఒంగోలులో పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం నిధులు కేటాయించకపోవడంపైన కూడా బాలినేని జగన్ పై గుర్రుగా ఉన్నారు. వీటిపై చర్చించేందుకు సీఎం జగన్ అవకాశం ఇవ్వకపోవడంతో బాలినేని అసంతృప్తి చెందారు. 


కొద్ది రోజులుగా ఎవరికీ అందుబాటులోకి లేకుండా హైదరాబాద్ లో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ సమావేశాలకు కూడా రాలేదు.  సీఎంవో సహా ముఖ్యనేతల సంప్రదించడంతో తాడేపల్లికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. అనంతరం బాలినేని సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ముఖ్య నేతలతో చర్చించారు. బుధవారం రాత్రి  సీఎం జగన్ ను కలిసి చర్చించనున్నట్లు తెలుస్తోంది.


బాలినేని కుమారుడు కీలక వ్యాఖ్యలు


ఇటీవలే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) కుమారుడు ప్రణీత్‌ రెడ్డి (Balineni Praneeth Reddy) చేసిన కీలక వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని ప్రణీత్ రెడ్డి అన్నారు. వాటి కోసమే ఆయన వేచి ఉన్నారని.. రెండు రోజుల్లో రూ.170 కోట్లు విడుదలవుతాయనే సమాచారం ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత తన తండ్రి ఒంగోలు వచ్చేస్తారని ప్రణీత్ రెడ్డి మాట్లాడారు. ఒంగోలులో గత ఆదివారం (జనవరి 14) నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి (Balineni Praneeth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.