Bajaj Hindusthan Sugar Shares: ఇన్వెస్టర్లకు చెప్పిన తియ్యటి కబురుతో, బజాజ్ హిందుస్థాన్ షుగర్ షేర్లు ఇవాళ (సోమవారం, 05 డిసెంబర్ 2022) కూడా హైపర్ ర్యాలీని కంటిన్యూ చేశాయి. అప్పర్ సర్క్యూట్‌ను తాకి ఆగిపోయాయి.
బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను వడ్డీతో కలిపి కట్టేశామని, ఒక్క రూపాయి కూడా ఇప్పుడు బ్యాంకులకు బాకీ లేమని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా శుక్రవారం ఈ కంపెనీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఇది లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అప్పులు తీర్చేసిందంటే, సంస్థ అభివృద్ధికి అడ్డంగా ఉన్న గుదిబండ తొలగిపోయినట్లే కాబట్టి, ఈ స్టాక్ మీద సెంటిమెంట్ బలపడింది. శుక్రవారం కూడా ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేసింది.
శుక్రవారానికి ముందు వరకు ఈ కంపెనీ ఒక అప్పుల కుప్ప. రుణాల ఎగవేతదారుగా ముద్ర పడిన సంస్థ. బ్యాంకులు, డెట్ సెక్యూరిటీల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీని, అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో అక్టోబర్ 31, 2022న డిఫాల్ట్ అయింది.
అప్పులు హుష్ కాకి
"అప్పుల విషయానికి సంబంధించి, టర్మ్ లోన్ వాయిదాలు (సెప్టెంబర్ 2022 వరకు), టర్మ్ లోన్ వడ్డీలు (నవంబర్ 2022 వరకు), అప్షనల్లీ కన్వర్టిబుల్ డిబెంచర్ల (OCD) కూపన్‌ను (FY 2022కి చెల్లించాల్సిన మొత్తం) చెల్లించామని రుణదాతలందరికీ తెలియజేస్తున్నాం" అని ఎక్సేంజ్ ఫైలింగ్‌లో ఈ కంపెనీ పేర్కొంది.
కంపెనీ ప్రకటన తర్వాత ఈ షేర్లు హాట్‌కేకులయ్యాయి. పంచదార కోసం వచ్చే చీమల్లా, ఈ షుగర్ కంపెనీ షేర్ల కోసం ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. రేట్ ఎక్కువైనా పర్లేదు తగ్గకూడదనుకుంటూ ధర పెంచేశారు. దీంతో, ఇవాళ ఈ స్క్రిప్ 20 శాతం జూమ్ అయి, రూ. 16.22 వద్దకు చేరుకుంది. అక్కడ అప్పర్ సర్క్యూట్‌లో చిక్కుకు పోయింది. శుక్రవారం కూడా 20 శాతం పెరిగి, రూ. 13.52 వద్ద స్థిరపడింది.
ఈ రెండు రోజులే నిలబెట్టాయి
ఈ 2 సెషన్లలోనే బజాజ్ హిందుస్థాన్ షుగర్ కౌంటర్ దాదాపు 43 శాతం లాభపడింది. నవంబర్ 23 నుంచి చూస్తే దాదాపు 55 శాతం పెరిగింది. గత నెల రోజుల కాలంలో 46 శాతం, ఈ ఆరు నెలల కాలంలో 11 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 8 శాతం లాభపడింది. వాస్తవానికి, ఈ రెండు రోజుల ర్యాలీని మినహాయిస్తే ఈ స్టాక్ నష్టాల్లోనే (డిఫాల్ట్ కారణంగా) ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.