Ram Lalla Idol Sculptor: అయోధ్య రాముడి విగ్రహాన్ని (Ayodhya Ram Lalla Idol) చెక్కిన అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రతిష్ఠించిన సమయంలో చూస్తే అసలు ఆ విగ్రహాన్ని చెక్కింది తానేనా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు. అలంకరణ తరవాత అంత ఆ రామయ్య విగ్రహానికి అంత అందం వస్తుందని ఊహించలేదని అన్నాడు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరవాత ఏదో తెలియని అందం అందులోకి వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 


"ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరవాత బాల రాముడి విగ్రహం రూపు రేఖలే మారిపోయాయి. అసలు తయారు చేసింది నేనేనా అని నాకే అనుమానం వచ్చింది. అలంకరణ తరవాత రామయ్య స్వరూపమే మారిపోయింది. చెక్కుతున్న సమయంలోనే ఒక్కో దశలో ఒక్కో విధంగా కనిపించింది. కానీ ఆభరణాలతో అలంకరించిన తరవాతే మొత్తం రూపురేఖలు మారిపోయాయి"


- అరుణ్ యోగిరాజ్, రామ్‌లల్లా విగ్రహ శిల్పి 


కళ్ల విషయంలో జాగ్రత్తలు..


నిజానికి ప్రాణ ప్రతిష్ఠకు ముందు బాల రాముడి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో కాస్త వివాదం తలెత్తినప్పటికీ రాముడి ముఖం చూసిన వాళ్లంతా తన్మయత్వంలో మునిగిపోయారు. "ఎంత బాగుందో" అని శిల్పిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా కళ్లు, పెదాలను చాలా శ్రద్ధతో చెక్కాడని ప్రశంసిస్తున్నారు. దీనిపైనే అరుణ్‌ని ప్రశ్నిస్తే "అంతా ఆ రాముడి దయ..ఆయన ఆదేశించాడు నేను చెక్కుకుంటూ వెళ్లాను అంతే" అని నవ్వుతూ సమాధానమిస్తున్నాడు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు దాదాపు 7 నెలలు శ్రమించినట్టు చెప్పాడు. ఈ 7 నెలల సమయం తనకు ఓ సవాల్‌గా మారిందని వివరించాడు. శిల్పశాస్త్రానికి తగ్గట్టుగా చెక్కడంతో పాటు ఐదేళ్ల రాముడిగా కనిపించేలా చెక్కడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పాడు. 


"బాల రాముడి విగ్రహం చెక్కిన సమయంలో ఆయన కళ్ల గురించే నాకు కాస్త భయం ఉండేది. అందుకే కళ్లు బాగున్నాయా అని మా ఫ్రెండ్స్‌ని పదేపదే అడిగాను. ఓ రాయిలో అలా ఓ భావాన్ని తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. చాలా సమయం వెచ్చించాలి. అందుకే చిన్న పిల్లలు ఎలా ఉంటారో గమనించి అదే పసిదనం రాముడి విగ్రహంలో కనిపించేలా చూసుకున్నాను. ఇదంతా ఆ రాముడి దయతోనే జరిగింది"


- అరుణ్ యోగిరాజ్, రామ్‌లల్లా విగ్రహ శిల్పి 


 అరుణ్ యోగిరాజ్ గతంలో ఎన్నో విగ్రహాలు చెక్కినప్పటికీ అయోధ్య రాముడి విగ్రహాన్ని చెక్కే అదృష్టం తనకే దక్కడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు. నిజానికి ప్రాణ ప్రతిష్ఠకు ముందు రామ్ లల్లా విగ్రహ ఫొటోలు బయటకి వచ్చాయి. కానీ...ఇవాళ ప్రాత ప్రతిష్ఠ చేసిన తరవాత తెర తొలగించారు. అప్పుడే తొలి దర్శనమిచ్చాడు అయోధ్య రాముడు. సోషల్ మీడియా అంతటా ఆ ఫొటోలే కనిపిస్తున్నాయి. "వందల ఏళ్ల కల నెరవేరింది" అంటూ అందరూ షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌లని చూసి ఎమోషనల్ అయ్యాడు అరుణ్ యోగి రాజ్. 


"ప్రస్తుతం ఈ భూమ్మీద అందరికన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. నా కుటుంబ సభ్యులు, ముందు తరాల వాళ్ల ఆశీస్సులతో పాటు ఆ రామయ్య ఆశీర్వాదాలు నాపై ఉన్నాయి. నాకు ఇంకా ఇది నమ్మేలా లేదు. కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది"


- అరుణ్ యోగిరాజ్, రామ్‌లల్లా విగ్రహ శిల్పి 


Also Read: తమిళనాడు ఇన్‌ఛార్జి సీఎంగా ఉదయనిధి బాధ్యతలు చేపట్టనున్నారా ? సీఎం స్టాలిన్ ఏమంటున్నారు ?