Telangana Common Entrance Tests: తెలంగాణలో ఎంసెట్ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించనున్నారు. 'ఎంసెట్' పేరు మార్పుపై జీవో జారీ అయితే గురువారం (జనవరి 25) సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన షెడ్యూలుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం (జనవరి 24) సాయంత్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే రెండో వారంలో ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది. పీఈసెట్, పీజీఈసెట్‌లు మాత్రం మే చివరి నుంచి జూన్ తొలి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు. ఎంసెట్‌తోపాటు ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్‌ల తేదీలను ప్రకటిస్తారు. ఈసెట్‌ను మాత్రం మే మొదటి వారంలో నిర్వహిస్తారు. మరోవైపు పీజీ ఇంజినీరింగ్ సెట్‌లో ఈసారి పరీక్ష విధానాన్ని మార్చాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సిఫారసు చేసింది.


తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే 'TSEAMCET' పేరు మారనుంది. ప్రవేశపరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పేరును TSEAPCET లేదా TSEACET గా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. దీనికి  2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తోంది. అయినప్పటికీ ఎంసెట్‌ పేరులో మెడికల్‌ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్‌ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 'P' అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నందున 'P' అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాాల్సి ఉంది. 


మరోవైపు ఏపీలో ప్రస్తుతం ఏపీఈఏపీసెట్‌ అనే పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గతంలో జారీచేసిన ఎంసెట్‌ జీవోను సవరించి, కొత్త జీవోను జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఎంసెట్‌ పేరు మార్పు జీవో త్వరలోనే ఖరారయ్యే అవకాశాలున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.


ఇంటర్, జేఈఈ వంటి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని… ఎంసెట్ షెడ్యూలును నిర్ణయిస్తుంటారు అధికారులు. అయితే తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. ఇక ఏప్రిల్ మాసంలో జేఈఈ పరీక్షలు ఉండనున్నాయి. ఏప్రిల్ వరకు ఇంటర్, జేఈఈ పరీక్షలు పూర్తి కానున్న నేపథ్యంలో మే నెలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఇదే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో ఉంది ఉన్నత విద్యా మండలి. ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..