Ayodhya Ramlala Idol: 


విగ్రహం ఇలా ఉంటుంది..


వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధమైపోతుందని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ తరవాత ట్రస్ట్ సెక్రటరీ ఛంపత్ రాయ్ కూడా కీలక విషయం వెల్లడించారు. గర్భగుడి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, రామ్‌లల్లా విగ్రహాన్ని వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠిస్తామని చెప్పారు. అయితే..ఆ రాముడి విగ్రహం ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై స్పష్టతనిచ్చారు చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్. విగ్రహం ఎలా ఉంటుందో వివరించారు. 


"అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం అద్భుతంగా ఉంటుంది. రాముడు నీల మేఘ శ్యాముడు కనుక ఆ రంగులోనే విగ్రహాన్ని తయారు చేయిస్తున్నాం. రామ్ లల్లాను పోలిన విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తాం. స్వామి వారి రూపాన్ని అలా చూడగానే మైమరిచిపోతారు. అంత అందంగా ఉంటుంది. 5-6 అడుగుల ఎత్తులో ఉండనుంది. రాముడి బాలావతారం కళ్లకు కట్టినట్టుగా ఆ విగ్రహంలో కనిపించాలి. చూసిన ప్రతి ఒక్కరూ బాల రాముడే అనుకోవాలి."  
-రామ మందిరం పూజారి 


వచ్చే ఏడాది సంక్రాంతికి..


"ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే ఏడాది జనవరికి ప్రారంభమవుతుంది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ వేడుకలు కొనసాగుతాయి" అని వెల్లడించారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్‌. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నట్టు చెప్పారు. త్వరలోనే భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు. "రామ్‌లాలా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తాం. వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ఈ వేడుక జరుగుతుంది" అని చెప్పారు. గర్భ గుడి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. 9 అడుగులు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 35 అడుగుల దూరం నుంచి చూసినా...రాముడు స్పష్టంగా కనిపిస్తాడని ట్రస్ట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ శిల్పులు రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నారు. "సాధువులతో చర్చించి రాముడి విగ్రహం ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శిలలతో విగ్రహం తయారు చేయిస్తాం" అని చంపత్‌ రాయ్ చెప్పారు. అయితే..విగ్రహం ఎత్తు విషయంలో ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం వల్ల చివరకు ఏది ఖరారవు తుందన్నది తేలాల్సి ఉంది.  


రెండూ ఒకేసారి..


ఈ ఆలయంతో పాటు మసీదు నిర్మాణ కూడా అదే గడువులోగా పూర్తవుతుందని ట్రస్ట్ తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. Indo Islamic Cultural Foundation Trustకు చెందిన ఓ సీనియర్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంటే...రాముడి ఆలయంతో పాటు మసీదు కూడా ఒకేసారి పూర్తవుతుందన్నమాట. ఇదే జరిగితే...అది చరిత్రాత్మకం అవుతుందని అంటున్నారు. రామ్‌ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో ముస్లింలకు చెందిన స్థలంలో కచ్చితంగా మసీదు నిర్మించాలని ఆదేశించింది. ముస్లింలు వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఈ తీర్పునిచ్చింది.


Also Read: Owaisi On RSS Chief: ముస్లింలు ఇండియాలో ఉండాలో లేదో చెప్పడానికి మీరెవరు - మోహన్ భగవత్‌కు ఒవైసీ కౌంటర్