Tata Motors Ford Plant: దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, అతి భారీ కొనుగోలును పూర్తి చేసింది. గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న ఫోర్డ్ ఇండియా (Ford India) తయారీ ప్లాంట్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. 


టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ అయిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌ (TPEML) ఈ డీల్‌ని ఫినిష్‌ చేసింది. ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు (FIPL) చెందిన సనంద్‌ ఫ్లాంట్‌ను రూ. 725.7 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ డీల్‌ గురించి గత ఏడాది (2022) ఆగస్టులోనే టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌ ప్రకటించింది, ఇప్పటికి ఆ ప్రాసెస్‌ పూర్తయింది.


రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం
రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా, గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న తన అసెట్‌తో పాటు ఫోర్డ్ ఇండియా తయారీ కర్మాగారం & మెషినరీని కొనుగోలు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ తెలియజేసింది. 


టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఆఫర్‌ను అంగీకరించిన, ఫోర్డ్ ప్లాంట్‌లో ఉన్న ఉద్యోగులందరూ తిరిగి ఉద్యోగాలు పొందారని కూడా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్‌ పేర్కొంది. ఈ డీల్‌ తర్వాత, జనవరి 10, 2023 నుంచి, ఆ ఫోల్డ్‌ సనంద్‌ ఫ్లాంటు ఉద్యోగి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌లో ఉద్యోగిగా మారారు.


ఈ డీల్‌ ద్వారా చేజిక్కిన ఆస్తులు ఏవి?
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ద్వారా టాటా మోటార్స్‌ చేపట్టిన కొనుగోలు ద్వారా... ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సనంద్ ప్లాంట్‌కు చెందిన మొత్తం భూమి టాటా మోటార్స్‌ వశమైంది. ఆ కార్ల తయారీ కర్మాగారానికి చెందిన భవనాలు, యంత్రాలు, పరికరాలు సహా సమస్త చర, స్థిర ఆస్తులు టాటా గ్రూప్‌ చేతికి వచ్చాయి. ఇది కాకుండా, సనంద్ ప్లాంట్‌లోని ఉద్యోగులు అందరూ టాటా గ్రూప్‌లోకి బదిలీ అయ్యారు. ఆ ఫ్లాంటులో వాహనాల తయారీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు కూడా ఈ ఒప్పందం కింద టాటా మోటార్స్ అనుబంధ సంస్థకు వచ్చాయి.


ఫోర్డ్‌ కార్ల ఫ్లాంట్‌ను టాటా మోటార్స్‌ కొనుగోలు చేసిందన్న వార్తతో, టాటా మోటార్స్‌ షేర్లు మంచి జోష్‌లో ఉన్నాయి. అస్థిర మార్కెట్‌లోనూ పూర్తి సానుకూలంగా ట్రేడవుతున్నాయి. 


గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో ఈ స్టాక్‌ దాదాపు 10 శాతం పుంజుకుంది. గత ఆరు నెలల కాలంలో 4 శాతం, గత ఏడాది కాలంలో 16 శాతం నష్టపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.