Average Study Time: ప్రతీ ఒక్కరు నిద్ర లేచినప్పటి నుంచి తమ పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పనులను చేసుకుంటారు. తమ తమ జీవితాలు, ఉద్యోగాలు, వ్యాపారాలను బట్టి పని, పడుకోవడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నారనే దానిపై కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంటుంది, ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారు, అనేది నిశితంగా పరిశీలించారు. ఇందుకోసం 58 దేశాల్లో వివిధ జాతీయ సర్వేల గణాంకాలను క్రోడీకరించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనిషి సగటును ఏఏ పనులకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో వివరించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతం ఈ అధ్యయనం పరిధిలోకి వచ్చారని చెప్పారు. 


అధ్యయనంలో ఏం తేలిందంటే..?


మనిషి సగటున ఉద్యోగం, ఉపాధి కోసం వారానికి సగున 41 గంటలు పని చేస్తున్నట్లు తెలిసింది. ఇంట్లో పరిశుభ్రతకు 2.5 గంటలు, తోట పనులు, ఆటలు ఆడడానికి సగటున 6.5 గంటలు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ప్రతిరోజూ సుమారు 3.4 గంటలు కేవలం తయారు చేయడం, సాగు చేయడం, అలాగే  వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి కేంద్రీకరించినట్లుగా బృందం కనుగొంది. ఇది ఆహారం వంటి సహజ వనరులను పొందడం, అలాగే భవనం, తయారీ, శుభ్రపరచడం మరియు వ్యర్థాలను నిర్వహించడానికి వెచ్చించే సమయాన్ని సూచిస్తుంది. గిన్నెలు కడుక్కోవడం, వంట చేసుకోవడం, టేబుళ్లు శుభ్రం చేసుకోవడానికి జనం 55 నిమిషాలు ఉపయోగిస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకుడు ఎరిక్ గాల్ బ్రెయిత్ వివరించారు. భోజనం చేయడానికి సగటున 96 నిమిషాలు అంటే 1.6 గంటలు వాడుతుండగా... నిద్ర కోసం 9 గంటల సమయం వెచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో పిల్లల అయితే 11 గంటల పాటు, పెద్ద అయితే 7.5 గంటల పాటు నిద్ర పోతున్నట్లు తెలిపారు. అలాగే స్నానం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసం 2.5 గంటలు పడుతున్నట్లు స్పష్టం చేశారు. 


పలు విషయాల్లో దేశాల మధ్య వ్యత్యాసం


కొన్ని విషయాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. మతపరమైన ప్రార్థనలు, పూజలకు నిత్యం 12 నిమిషాలు వెచ్చిస్తుండగా.. కొన్ని దేశాల్లో ఈ సమయం మరింత ఎక్కువగా ఉందన్నారు. వివిధ దేశాల నడుమ ఆదాయంలో తేడాలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఆయా దేశాల్లో వివిధ పనులకు ప్రజలు వెచ్చించే సమయాల్లోనూ తేడాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఉదాహరణకు సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో వ్యవసాయం కోసం వెచ్చించే సమయం అధికం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సమయం విషయంలో దేశాల మధ్య పెద్దగా తేడాలు లేవని గుర్తించారు. 


కెనడా, చైనా, జపాన్ మరియు రష్యాలో సేకరించిన డేటాతోపాటు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) నిర్వహించే ఆన్‌లైన్ స్టాటిస్టిక్ రిపోజిటరీ నుంచి సేకరించిన ఆర్థిక కార్యకలాపాల సమాచారాన్ని కూడా తీసుకొని ఈ లెక్కలు తేల్చారు. మొత్తంగా ప్రపంచ జనాభాలో 86% ప్రాతినిధ్యం వహిస్తున్న 139 దేశాలకు సంబంధించిన డేటా ఇది.